నాగచైతన్య శోభిత నిశ్చితార్థం
ABN, Publish Date - Aug 09 , 2024 | 12:47 AM
టాలీవుడ్ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ కథానాయిక శోభితా దూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేయనున్నారు...
టాలీవుడ్ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ కథానాయిక శోభితా దూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేయనున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం గురువారం ఉదయం హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువైపులా కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. నిశ్చితార్థం ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేసి, కాబోయే దంపతులను ఆశీర్వదించాలని కోరారు. ‘ఈ రోజు ఉదయం మా అబ్బాయి నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం జరిగింది. ఈ మధుర క్షణాలను మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. మీ ఇద్దరూ ప్రేమ, సంతోషంతో కలకాలం జీవించాలని కోరుకుంటున్నాను’ అని నాగార్జున పేర్కొన్నారు.
నిశ్చితార్థ వేడుకలో శోభిత ఉప్పాడ పట్టు చీర ధరించగా, నాగచైతన్య పంచెకట్టు, పైన కండువా ధరించి సంప్రదాయ వస్త్రధారణతో కనువిందు చేశారు. పలువురు సినీ ప్రముఖులు నాగచైతన ్య, శోభితకు అభినందనలు తెలిపారు. మరికొద్ది రోజుల్లో వీరి వివాహం జరగనుంది. సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య శోభితతో ప్రేమలో పడ్డారనీ, ఇద్దరూ తరచూ కలుసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. పలు సందర్భాల్లో నాగచైతన్య, శోభితా జంటగా కనిపించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ నిశ్చితార్థం వరకూ వారు ఎక్కడా దీనిపై స్పందించలేదు. నాగచైతన్య, శోభిత కలసి ఒక్క సినిమా కూడా చేయలేదు. స్నేహితుల ద్వారా ఇద్దరికీ పరిచయం అయ్యు అది ప్రేమగా మారిందని సమాచారం. చూసేందుకు ఇంటర్నేషనల్ మోడల్‌లా కనిపించే శోభిత తెలుగమ్మాయే. తెనాలిలో జన్మించారు. కొన్నాళ్లు కుటుంబంతో విశాఖలో ఉన్నారు. ముంబైలో ఉన్నత విద్యను అభ్యసించారు. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టారు. 2013 ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకున్నారు. 2016లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘రామన్ రాఘవన్’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ‘గూఢచారి, మేజర్’ చిత్రాల్లో నటించారు.
నాడు ప్రేమ ప్రకటన
‘ఏ మాయ చేశావే’ చిత్రంలో జంటగా నటించిన నాగచైతన్య, సమంత ఏడేళ్ల డేటింగ్ తర్వాత 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 8న నాగచైతన్యకు తన ప్రేమ ప్రతిపాదన చేశానని సమంత ఓ సందర్భంలో చెప్పారనీ, ఇప్పుడు అదే తేదీన నాగచైతన్య శోభితల నిశ్చితార్థం జరగడం కాకతాళీయమేనా, కావాలనే అలా చేశారా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నారు. శోభిత హిందీలో ‘సితార’ చిత్రం చేస్తున్నారు.