డజనుకు పైగాచిత్రాలు.. ఒకే రోజు!

ABN, Publish Date - Aug 07 , 2024 | 01:10 AM

ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు విడుదల కావడం సర్వసాధారణమే. సంక్రాంతికో.. దసరాకో.. ఇలా ఆరు లేదా ఏడు సినిమాలు ఒకే రోజు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకూ భారీ బడ్జెట్‌ చిత్రాలే...

ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు విడుదల కావడం సర్వసాధారణమే. సంక్రాంతికో.. దసరాకో.. ఇలా ఆరు లేదా ఏడు సినిమాలు ఒకే రోజు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకూ భారీ బడ్జెట్‌ చిత్రాలే ఉంటాయి. మీడియం బడ్జెట్‌లో తయారైన చిత్రాలు కూడా ఒక రోజున ఐదారు విడుదలైన సందర్భాలు లేకపోలేదు. అయితే వచ్చే గురువారం (ఆగస్టు 15) నాడు ఒకటి కాదు రెండు కాదు .. దాదాపు డజనుకు పైగా దక్షిణాది చిత్రాలు వెండితెర పై సందడి చేయనున్నాయి. స్వాతంత్య దినోత్సవంతో పాటు లాంగ్‌ వీకెండ్‌ కూడా కలసి వస్తుండడమే ఈ సందడికి కారణం. ఆ సినిమాల వివరాల్లోకి వెళితే...

మాస్‌ మసాలా సినిమాలకు పెట్టింది పేరు రవితేజ. ఆయన నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’తో థియేటర్లలో జోష్‌ తీసుకురావడానికి దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇందులో రవితేజ, బిగ్‌ బీ అమితాబ్‌ ఫ్యాన్‌గా కనిపించనున్నారు. సినిమాలో ఆయన ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారి పాత్రను పోషించారు. . యాక్షన్‌తో కూడుకున్న ఈ మాస్‌ ఎంటర్టైనర్‌ అందరికీ నచ్చుతుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. గతంలో రవితేజతో ‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ వంటి చిత్రాలు తెరకెక్కించిన హరీశ్‌ శంకర్‌ దీనికి దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాలో రవితేజ వింటేజ్‌ లుక్‌, నూతన నటి భాగ్యశ్రీ బోర్సే అందాలు సినిమాకు ప్లస్‌ అవుతాయని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.


బంగారు గనుల నేపథ్యంలో...

‘శివ పుత్రుడు’, ‘అపరిచితుడు’ వంటి చిత్రాలతో తెలుగుతోనూ పాపులర్‌ అయిన నటుడు విక్రమ్‌. ఆయన లేటె్‌స్టగా నటించిన పీరియాడికల్‌ డ్రామా చిత్రం ‘తంగలాన్‌’. ‘మద్రాస్‌’, ‘కాలా’ చిత్రాల ఫేమ్‌ పా.రంజిత్‌ దీనికి దర్శకత్వం వహించారు. 19వ శతాబ్దంలో కర్ణాటకలోని కోలార్‌ బంగారు గనుల కార్మికుల జీవితాల నేపథ్యంలో జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో విక్రమ్‌తో పాటు పాత్రధారులందరూ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా అయినా విక్రమ్‌ విజయాల కొరతను తీరుస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌.. సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్‌ చేశాయి.

డబుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో 2019లో సూపర్‌ హిట్‌ కొట్టారు డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, హీరో రామ్‌ పోతినేని. వారి కలయికలో ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరీ జగన్నాథ్‌, రామ్‌ పోతినేనికి ఈ చిత్ర విజయం చాలా కీలకం కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ సినిమాపై అంచనాలను పెంచేసేలా చేశాయి. యాక్షన్‌ సన్నివేశాలకు థియేటర్స్‌లో పూనకాలు గ్యారంటీ అని చిత్ర బృందం ధీమాగా ఉంది. పూరి మార్క్‌ డైలాగ్స్‌ను తెలంగాణ యాసలో రామ్‌ పలికిన తీరు.. సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా నటిస్తుండడం, మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధానాకర్షణగా ఉండనున్నాయి.


‘ఆయ్‌’ అంటూ సందడి

గోదావరి యాస నేపథ్యంలో.. ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఆ కోవలోకి చెందిన చిత్రమే ‘ఆయ్‌’. ‘మేం ఫ్రెండ్సండి’ ట్యాగ్‌లైన్‌. ఫుల్‌ లెంగ్త్‌ వినోదం గ్యారంటీ అంటూ ప్రచార చిత్రాలతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాను అంజి కంచిపల్లి తెరకెక్కించారు. నార్నే నితిన్‌, నయన్‌ సారిక ఇందులో హీరో హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో సినిమాకు పాజిటివ్‌ బజ్‌ వచ్చింది.

పెద్ద విజయం కోసం... చిన్న కథ

వినోదాత్మక చిత్రాలతో ఓ వైపు అలరిస్తూనే.. ప్రయోగాత్మక చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలకు ఎప్పుడూ ముందుండే నటుడు ప్రియదర్శి. ఆయన చాణక్య వర్మ అనే పాత్రతో స్కూల్‌ టీచర్‌గా నటించిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’. సెలక్టివ్‌గా సినిమాలు చేసే నివేదా థామస్‌ ఇందులో ఓ మధ్య తరగతి ఇల్లాలి పాత్రను పోషించారు. విశ్వదేవ్‌, భాగ్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. నంద కిశోర్‌ ఈమని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంటిల్లిపాదినీ అలరించే వినోదంతో పాటు గుండెని బరువెక్కించే భావేద్వోగాలూ ఉన్నాయని టీజర్‌ ద్వారా తెలుస్తోంది.


అదే రోజున ఈ చిత్రాలు కూడా...

నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే కీర్తి సురేశ్‌.. కయల్విజి అనే పాత్రలో, హిందీ రాని తమిళమ్మాయిగా.. నటించిన తమిళ చిత్రం ‘రఘుతాత’.. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘కల్యాణ వైభోగమే’ ఫేమ్‌ మాళవిక నాయర్‌ నటించిన ‘క్రిష్ణమ్‌ ప్రణయ సఖీ’ అనే కన్నడ సినిమా.. హిందీ చిత్రం ‘అంధాధూన్‌’ రీమేక్‌గా తమిళంలో తెరకెక్కిన ‘అంధగాన్‌’.. ‘డిమోంటీ కాలనీ’ అంటూ తెలుగు వారిని భయపెట్టిన తమిళ హారర్‌ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ‘డిమోంటీ కాలనీ 2’.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ నటించిన థ్రిల్లర్‌ ‘భైరతి రణగల్‌’.. భావన నటించిన ‘హంట్‌’ అనే మలయాళ హారర్‌ థ్రిల్లర్‌.. ‘దృశ్యం’ సినిమా సిరీ్‌సతో నేషనల్‌వైడ్‌ గుర్తింపు పొందిన జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్‌ ‘నునకూజి’.. ‘వాజా’ అనే మలయాళ కామెడీ చిత్రం కూడా అదే రోజు బాక్సాఫీస్‌ వద్ద ఇతర సినిమాలతో పోటీ పడుతున్నాయి. ఈ సినిమాల్లో ఏవి ప్రేక్షకుల ఆదరాభిమానాలు దక్కించుకుంటాయో ఈ నెల 15 వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - Aug 07 , 2024 | 01:10 AM