‘అమ్మ’ అధ్యక్ష పదవికి మోహన్‌లాల్‌ రాజీనామా

ABN, Publish Date - Aug 28 , 2024 | 02:40 AM

జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో మలయాళ చిత్రసీమ మరింత వేడెక్కుతోంది. ఆరోపణలతో మొదలై విమర్శలు, ఖండనలు, రాజీనామాలను దాటి వ్యవహారం కేసుల దాకా వెళ్లింది...

  • నటి రేవతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్ధిఖీ

  • మీడియా ఆజ్యం పోస్తోంది కేంద్రమంత్రి సురేశ్‌ గోపి

జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో మలయాళ చిత్రసీమ మరింత వేడెక్కుతోంది. ఆరోపణలతో మొదలై విమర్శలు, ఖండనలు, రాజీనామాలను దాటి వ్యవహారం కేసుల దాకా వెళ్లింది. మంగళవారం మరికొందరు నటీమణులు ‘మీటూ’ అంటూ ముందుకొచ్చారు. మల్లూవుడ్‌లో తాము ఎదుర్కొన్న వేధింపులను వారు బయటపెట్టగా, ఆధారాలు చూపాలంటూ వారిపై ఆరోపణలను ఎదుర్కొంటున్న వారు ఎదురుదాడికి దిగారు. ఈ పరిణామాలతో కీలక స్థానాల్లో ఉన్న సినీ ప్రముఖులు సైతం ఆరోపణలకు సమాధానం చెప్పలేక తమ పదవులను త్యజిస్తున్నారు. ఇన్నాళ్లూ చక్కటి అభిరుచితో సినిమాలను తెరకెక్కిస్తూ జాతీయ స్థాయిలో ఖ్యాతిని కూడగట్టుకున్న మలయాళ సినిమా ఇప్పుడు మహిళలపై వేధింపులతో వార్తలతో అపఖ్యాతి మూటగట్టుకుంటోందనేది సగటు ప్రేక్షకుడి ఆవేదన.


మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ రద్దు

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ నేపథ ్యంలో నటుడు మోహన్‌లాల్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ(అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కీలక వ్యక్తులపై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యతగా ఆయనతో పాటు మరో 17 మంది సభ్యులు తమ పదవులకి రాజీనామా చేశారు. అలాగే, ఈ చిత్రమండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, లైంగిక ఆరోపణల నేపథ్యంలో.. ఇటీవలే దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణన్‌ కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడి పదవి నుంచి వైదొలిగారు. నటుడు సిద్ధిఖీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. తన పరువుకు భంగం కలిగించారని నటి రేవతిపై ఆయన కేరళ డిప్యూటీ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌కు ఫిర్యాదు చేశారు. మలయాళ చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి స్పందించారు. ‘‘చిత్ర సీమలో వస్తున్న లైంగిక ఆరోపణల గురించి మీడియా చేస్తున్న ప్రచారం ప్రజలని తప్పుదోవ పట్టిస్తోంది. స్వలాభం కోసం మీడియా ఇలా వాస్తవాలు తెలియకుండా ప్రచారం చేయడం సరికాదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖం చూపించి మాట్లాడు

నటుడు, ‘అమ్మ’ జాయింట్‌ సెక్రటరీ బాబూరాజ్‌పై ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఇటీవలే లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఆయన మంగళవారం ఖండించారు. ‘‘ఎవరైతే నాపై ఆరోపణలు చేశారో.. ముఖం చూపించి మాట్లాడాలని సవాలు విసురుతున్నాను’’ అని పేర్కొన్నారు. అయితే ఇటీవలే ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ బాబూరాజ్‌పై ఆరోపణలు చేశారు. ‘‘బాబూరాజ్‌.. నన్ను ఓ సినిమాలో ఎంపిక చేశానని.. నా పాత్ర కోసం చర్చించడానికి దర్శకులు, నిర్మాతలు వస్తున్నారని.. తన ఇంటికి పిలిచాడు. తన మాటలు నమ్మి నేను వెళ్లాను. కాసేపటికి ఆయన..


సినిమాలో నీ పాత్ర కోసం చర్చలు జరుగుతున్నాయి.. కాసేపు విశ్రాంతి తీసుకోమ్మని ఓ రూమ్‌ చూపించారు. నేను రూమ్‌లో ఉండగా బాబూరాజ్‌ బలవంతంగా లోపలికి దూసుకొచ్చి నాపై లైంగిక దాడి చేశారు’’ అని ఆ జూనియర్‌ ఆర్టిస్‌ తన పేరు వెల్లడించకుండా సోషల్‌ మీడియాలో ఆరోపించారు.

బెంగాలీ ఇండస్ట్రీలోనూ...

మలయాళ పరిశ్రమలోనే కాదు బెంగాలీ చిత్రసీమలోనూ మహిళలపై వేధింపులు ఉన్నాయని నటి రితాభరి చక్రవర్తి ఆరోపించారు. ‘‘నాతోటి నటీమణులు, దర్శక, నిర్మాతలు, హీరోల చేతిలో వేధింపులను ఎదుర్కొన్నారు. బెంగాలీ చిత్రసీమలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జస్టిస్‌ హేమ కమిటీలాంటిదే ఇక్కడా ఏర్పాటు చేయాలి’’ అని రితాభరి సోషల్‌మీడియాలో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు.

Updated Date - Aug 28 , 2024 | 02:41 AM