Drishyam: హాలీవుడ్‌కు ‘దృశ్యం’.. మొదటిది కాదు చాలా ఉన్నాయ్!
ABN, Publish Date - Feb 29 , 2024 | 06:51 PM
దేశవ్యాప్తంగా సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీ సినిమా ఏదైనా ఉందంటే.. అది దృశ్యం చిత్రమనే చెప్పాలి. మొదటగా మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌తో అన్ని భాషల్లోనూ రీమేక్ అయి మంచి విజయాలు సాధించింది. అయితే తాజాగా ఈ సినిమా హాలీవుడ్‌తో పాటు స్పానిష్‌లలోనూ తెరకెక్కించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీ సినిమా ఏదైనా ఉందంటే.. అది దృశ్యం (Drishyam) చిత్రమనే చెప్పాలి. మొదటగా మలయాళంలో మోహన్‌లాల్ (Mohanlal), మీనాలతో ఆరంభమైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయి తర్వాత అన్ని భాషల్లో తమిళంలో కమల్ హసన్, తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్ దేవగణ్ వంటి స్టార్లతో రీమేక్ చేయగా ప్రతిచోటా మంచి విజయాలు సాధించింది.
ఈ క్రమంలో కొరియన్‌లోనూ రిమేక్ చేయబడిన ఈ చిత్రం అక్కడ హిట్ అయింది. అయితే తాజాగా ఈ సినిమా హాలీవుడ్‌తో పాటు స్పానిష్‌లలోనూ తెరకెక్కించను న్నట్లు నెట్టింట వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ అనే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఇంగ్లీష్‌లో రిమేక్ చేయనుండగా ఎవరు నటిస్తున్నారనే విషయం బయటకి రాలేదు.
అయితే హాలీవుడ్‌లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రం ‘దృశ్యం’ (Drishyam) అంటూ ఉదయం నుంచి సోషల్ మీడియాలో బాగా వార్తలు హల్‌చల్ చేస్తుండగా వీటిపై సినీ అభిమానుల నుంచి నెటిజన్ల నుంచి వపలు రకాలుగా స్పందన వస్తోంది. దృశ్యం కన్నా ముందే జబ్ వీ మెట్, ఏ వెగ్నెస్‌డే వంటి బాలీవుడ్ చిత్రాలు హాలీవుడ్‌లో రిమేక్ చేశారని, ఇది ఫస్ట్ మళయాళం చిత్రం అయి ఉంటుందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలాఉండగా ఇదివరకే బాలీవుడ్ చిత్రాలతో పాటు కొన్ని తెలుగు చిత్రాలు హాలీవుడ్ బాట పట్టిన చరిత్ర ఉంది. ముఖ్యంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రమ్యకృష్ణ జంటగా వచ్చిన ఆహ్వానం సినిమాను ఆయనే హాలీవుడ్‌లో 2012లో అక్కడి నటులతో డైవర్స్ ఇన్విటేషన్ (Divorce Invitation) అనే పేరుతో తెరకెక్కించి విజయం కూడా సాధించడం గమనార్హం.