మెగా విరాళం
ABN, Publish Date - Aug 05 , 2024 | 06:20 AM
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి నష్టపోయిన కుటుంబాలకు ఆసరా అందించేందుకు.. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటికే పలువురు సినీతారలు విరాళాలు...
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి నష్టపోయిన కుటుంబాలకు ఆసరా అందించేందుకు.. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటికే పలువురు సినీతారలు విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్, అల్లుఅర్జున్ కూడా బాధితులు విరాళాలు ప్రకటించారు. చిరంజీవి, రామ్‌చరణ్ రూ.కోటి విరాళం అందించి, ఈ విపత్తులో నష్టపోయిన కుటుంబాలకు తమ వంతు సహాయాన్ని చాటారు. ‘‘ప్రకృతి విపత్తు వల్ల జరిగిన ఈ ప్రాణ నష్టాన్ని చూస్తుంటే నా గుండె బరువెక్కిపోతోంది. బాధితుల కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని చిరంజీవి ఎక్స్‌లో పేర్కొన్నారు. మరోవైపు, ఆదివారం ఉదయం అల్లు అర్జున్ కూడా రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ‘‘కేరళలో జరిగిన ఈ సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. కేరళ ప్రజలు నాపై ఎంతో ప్రేమ చూపారు. వారి కోసం నా వంతుగా నేను ఈ సహాయం చేస్తున్నాను’’ అని అల్లు అర్జున్ ఎక్స్‌లో పేర్కొన్నారు. సంయుక్త మీనన్ కేరళలో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న విశ్వశాంతి ఫౌండేషన్‌కు విరాశం అందించినట్లు తెలిపారు. కానీ ఆమె ఎంత మొత్తం అందించారు అనేది గోప్యంగా ఉంచారు.