Mahesh Babu @25: కథానాయకుడిగా మహేష్ 'రాజకుమారుడు' 25 సంవత్సరాలు పూర్తి

ABN, Publish Date - Jul 30 , 2024 | 06:15 PM

బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన మహేష్ బాబు, కథానాయకుడిగా 'రాజకుమారుడు' సినిమాతో పరిచయం అయ్యారు. ఈ సినిమా నేటికీ 25 సంవత్సరాలు పూర్తయింది. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా మహేష్ బాబు పరిశ్రమలోకి వచ్చి, తాను కూడా సూపర్ స్టార్ అయి కథానాయకుడిగా కూడా సంచలనాలు సృష్టించారు.

Mahesh Babu debut film Rajakumarudu completed 25 years

ఎవరైనా అబ్బాయి అందంగా వున్నాడు అంటే, 'అబ్బ, అచ్చం మహేష్ బాబులా వున్నాడు' అని అంటూ వుంటారు. అది ఇప్పుడు ఒక కామన్ మాట అయిపొయింది ప్రతి దగ్గరా. ఒక్క తెలుగు పరిశ్రమలోనే కాదు, భారతదేశంలో వున్న అందమైన నటుల్లో మహేష్ బాబు ఒకరు. సినిమాలు చేస్తున్నకొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్ బాబు అందం మరింత ద్విగుణీకృతం అయిందే తప్ప, తరగలేదు. అటువంటి మహేష్ బాబు కథానాయకుడిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం 'రాజకుమారుడు' ఆగస్ట్ 30, 1999 లో విడుదలైంది. అంటే ఇదే రోజు 25 సంవత్సరాల క్రితం విడుదలైంది అన్నమాట.

మహేష్ బాబు మొదటి సినిమా దర్శకేందురు కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. ఇందులో హిందీ నటి ప్రీతీ జింటా మొదటి సారిగా తెలుగులో ఈ సినిమాతో అరంగేట్రం చేశారు. ప్రముఖ నిర్మాత అశ్వని దత్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా మహేష్ కి కథానాయకుడిగా మొదటి విజయాన్ని అందించింది. బాలనటుడిగా మహేష్ అనేక సినిమాలో నటించి తరువాత చదువుకోసమని బ్రేక్ తీసుకున్నారు. చదువయిపోయాక ఎవరితో మహేష్ ని లాంచ్ చెయ్యాలని చూస్తున్న సమయంలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 'యమలీల' సినిమా కథని కృష్ణకి చెప్పారట.

కృష్ణకి కూడా కథ నచ్చడంతో మహేష్ ని ఈ సినిమాతో లాంచ్ చెయ్యాలని ప్లాన్ చేశారట. అయితే ఎందుకో ఈ సినిమా కొంచెం డిలే అవటంతో కృష్ణా రెడ్డి ఈ సినిమా అలీ తో పూర్తి చేశారు. తరువాత మహేష్ బాబుని లాంచ్ చెయ్యడానికి ప్రయత్నాలు చేసినప్పుడు పరుచూరి సోదరులు 'రాజకుమారుడు' కథతో కృష్ణ దగ్గరికి వెళితే ఆ కథ నచ్చి కృష్ణ వెంటనే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకి మహేష్ మొదటి సినిమా బాధ్యతలని అందచేశారు. పద్మాలయ సంస్థ నుండి ఎన్నో సినిమాలు నిర్మించిన కృష్ణ, తన కుమారుడు మహేష్ బాబు మొదటి సినిమా మాత్రం నిర్మాత అశ్వని దత్ కి ఇచ్చారు. అలా మహేష్ బాబు మొదటి సినిమా 'రాజకుమారుడు' మొదలై, విడుదలై ఘన విజయం సాధించింది.

మహేష్ బాబు పక్కన నటించిన ప్రీతి జింటా ఈ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ఈ సినిమాకి ఇంకొక హైలైట్ సంగీత దర్శకుడు మని శర్మ. తన సంగీతంతో చక్కటి పాటలని అందించిన మణిశర్మ ఈ సినిమా విజయంలో ఒక భాగం అయ్యారు. ఈ సినిమా విడుదలై 44 కేంద్రాల్లో 100 రోజులు నడిచి మహేష్ బాబుకి మొదటి సినిమా ఎంతో ఘన విజయాన్ని అందించింది. ఈ సినిమాకి ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు కూడా లభించింది.

Updated Date - Jul 30 , 2024 | 06:15 PM