ఆ ప్రశ్నలకు సమాధానం కల్కి

ABN, Publish Date - Jun 19 , 2024 | 04:23 AM

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ సైన్స్‌ ఫిక్షన్‌ ఎపిక్‌ ‘కల్కి 2898 ఏడీ’ ఈ నెల 27న విడుదల కానుంది. వైజయంతీ మూవీస్‌ సంస్థ అధినేత అశ్వనీదత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ విజువల్‌ వండర్‌...

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ సైన్స్‌ ఫిక్షన్‌ ఎపిక్‌ ‘కల్కి 2898 ఏడీ’ ఈ నెల 27న విడుదల కానుంది. వైజయంతీ మూవీస్‌ సంస్థ అధినేత అశ్వనీదత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ విజువల్‌ వండర్‌ రోజురోజుకీ అంచనాలు పెంచుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఎపిక్‌ జర్నీ వన్‌.. ది ప్రిల్యూడ్‌ ఆఫ్‌ కల్కి 2898 ఏడీ’ ని మంగళవారం విడుదల చేశారు. ఈ వీడియోలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ‘కలియుగంలో ఏం జరుగుతుంది, ఏం జరగవచ్చు.. ఇలాంటి ప్రశ్నలకు ‘కల్కి’ క్లైమాక్స్‌ సమాధానం. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఉన్న వారందరికీ సంబంధించిన కథ ఇది. నాకు చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలు అంటే ఇష్టం. అలాగే హాలీవుడ్‌లో వచ్చిన ‘స్టార్‌ వార్స్‌’ వంటి సినిమాలు కూడా నన్ను ఆకట్టుకున్నాయి. అయితే ఇలాంటి సినిమాలను అక్కడే తీయాలా, మనం తీయలేమా అనిపించేది. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి.


కృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమైనప్పుడు ఏం జరుగుతుంది అనే సృజనాత్మక ఊహతో రాసుకున్న కథ ఇది. మనం చదివిన పురాణాలు, ఎపిక్స్‌.. అన్నింటికీ ఈ సినిమా క్లైమాక్స్‌లా ఉంటుంది. ఒక యుగంలో రావణుడు, మరో యుగంలో దుర్యోధనుడు.. ఇలా అన్నింటిలోంచి ఓ రూపం తీసుకుని దాంతో పోరాటం ఎలా ఉంటుందన్న ఐడియాతో ‘కల్కి’ కథ రాయడానికి ఐదేళ్లు పట్టింది. సరికొత్తగా రూపుదిద్దుకున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మైథాలజీని చూసి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అన్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటాని, రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Updated Date - Jun 19 , 2024 | 04:23 AM