Kalki 2898 AD: ప్రభాస్ సినిమా సెన్సారు పూర్తి, రిపోర్టు, నిడివి వివరాలు తెలుసుకోండి
ABN, Publish Date - Jun 21 , 2024 | 12:22 PM
ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ లో వస్తున్న 'కల్కి 2898ఏడి' సినిమా ఈనెల 27న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలు కూడా నిన్ననే పూర్తయినట్టుగా తెలిసింది. ఈ సినిమాకి పెద్దగా కట్స్ ఏమి చెప్పలేదు కానీ...
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోణె, దిషా పటాని లాంటి నటీనటులు నటించిన 'కల్కి 2898 ఏడి' సినిమా ఈనెల 27న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకుడు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కథ అని ముందే చెప్పారు. ద్వాపర యుగం అయిన తరువాత, కలియుగం తరువాత కొన్ని సంవత్సరాలు ఇలా మూడు ప్రదేశాల్లో జరిగియే కథలు చూపించటానికి ప్రయత్నం చేశారు దర్శకుడు. వాటికే కాంప్లెక్స్, కాశీ, శంబాలా అని ఇలా మూడు పేర్లు పెట్టి ఈ మూడు పట్టణాల్లో జరిగే సంఘటనలు చూపించినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలు నిన్న హైదరాబాదులో పూర్తయ్యాయి అని తెలుస్తోంది. ఈ సినిమాకి ముందుగా వాయిస్ ఓవర్ లో డిస్క్రిమినేషన్ ఇవ్వవలసిందిగా సెన్సారు సభ్యులు కోరినట్టుగా తెలిసింది. ఈ సినిమా కల్పిత కథ అని సెన్సారు సభ్యులు వెయ్యమన్నారు అని తెలిసింది. అలాగే ఈ కథలో సినిమా కోసం సినిమా లిబర్టీ తీసుకున్నారని, అంతేకానీ ఏ మతాన్ని కించపరచాలని ఉద్దేశం తమకి లేదని కూడా వెయ్యమన్నట్టుగా సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చెప్పినట్టుగా తెలిసింది. అలాగే ఎక్కువగా కట్స్ ఏమీ లేకుండానే ఈ సినిమాకి యూ/ఏ (U/A) సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిసింది. సర్టిఫికెట్ లో ఈ సినిమా నిడివి 180 నిమిషాల 56 సెకండ్స్ వున్నట్టుగా తెలిసింది. 180 నిముషాలు అంటే మూడు గంటల పాటు ఈ సినిమా ఉంటుంది.
ఇది ప్రభాస్ సినిమాలు అన్నిటికన్నా చాలా ఎక్కువ నిడివి వున్న సినిమా అని తెలుస్తోంది. ప్రభాస్ ముందు సినిమా 'ఆదిపురుష్' నిడివి 179 నిముషాలు ఉంటే, ప్రభాస్ ఇంకో సినిమా 'సలార్' సినిమా నిడివి 175 నిముషాలు ఉంటుంది. ఇంకో సినిమా 'సాహో' కూడా 171 నిముషాల నిడివి వుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు కూడా వరసగా 159, 168 నిముషాల నిడివి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన 'కల్కి 2898ఏడి' ఇప్పటివరకు విడుదలైన ప్రభాస్ సినిమాలలో ఎక్కువ నిడివి కలిగిన చిత్రంగా వుంది.