జస్ట్ ఆస్కింగ్.. అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు
ABN, Publish Date - Sep 27 , 2024 | 02:15 AM
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వివిధ అంశాలపై స్పందిస్తూ ‘జస్ట్ ఆస్కింగ్ ’ అంటూ ప్రశ్నలు సంధిస్తుంటారు. తిరుమల లడ్డు వివాదంపై...
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వివిధ అంశాలపై స్పందిస్తూ ‘జస్ట్ ఆస్కింగ్ ’ అంటూ ప్రశ్నలు సంధిస్తుంటారు. తిరుమల లడ్డు వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు, ప్రకాశ్‌రాజ్‌కు మధ్య మూడు రోజుల క్రితం మొదలైన ట్వీట్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రకాశ్‌రాజ్ పోస్టులపై వవన్‌కల్యాణ్ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మీడియా సమావేశంలో హెచ్చరించడంతో ఈ ట్వీట్ల అటాక్ మొదలైంది. ‘నేను విదేశాల్లో ఉన్నా.. ఇండియా వచ్చిన తర్వాత మీ ప్రశ్నలకు సమాధానం చెబుతా’ అని ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారు. అంతటితో ఈ వ్యవహారం ముగిసిందని అందరూ భావించారు. కానీ ప్రకాశ్‌రాజ్ ఊరుకోలేదు.
తమిళ హీరో కార్తీ లడ్డు వ్యవహారంపై క్షమాపణ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ‘చేయని తప్పునకు క్షమాపణలు చెప్పించుకోవడంలో ఆనందం ఏమిటో.. జస్ట్ ఆస్కింగ్’ అంటూనే వ్యంగ్య బాణం వదిలారు. అయితే ఈ ట్వీట్‌పై పవన్‌కల్యాణ్ స్పందించలేదు. ఆయన మౌనంగా ఉన్నా ఊరుకోకుండా గురువారం మరో ట్వీట్ బాణం వదిలారు ప్రకాశ్‌రాజ్. ‘గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక మరో అవతారం .. ఏమిటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం.. జస్ట్ ఆస్కింగ్’ అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ పెట్టిన ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.