Jayasudha: అవార్డు ఫంక్షన్ కి వచ్చిన జయసుధ ఫోటో వైరల్, ఎందుకంటే...
ABN, Publish Date - Mar 05 , 2024 | 04:40 PM
'మనంసైతం' సేవలను గుర్తించి ఆ సంస్థ స్థాపించిన నటుడు కాదంబరి కిరణ్‌కు రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కారం. సినిమారంగం నుంచి జయసుధకి అవార్డుతో సత్కరించారు
నటుడు, దర్శకుడు కాదంబరి కిరణ్ 'మనంసైతం' అనే సంస్థని ప్రారంభించి పదేళ్లకి పైగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అతని చేస్తున్న ఈ సేవా దృక్పథానికి రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చి సత్కరించారు. హైదరాబాద్ లోని ఎఫ్ఎన్‌సీసీలో జరిగిన రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు వేడుకలో తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం చేతుల మీదుగా ఈ అవార్డును కాదంబరి కిరణ్‌కు అందించారు. (Rotary Club honoured with Excellence awards for Kadambari Kiran and Jayasudha Kapoor)
కాదంబరి కిరణ్ చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శమని బుర్ర వెంకటేశం అతని సేవలని కొనియాడారు. రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ జోన్ నిర్వహకులు సీవీ సుబ్బారావు, సుదేష్ రెడ్డి, టీ ఎన్ ఎం చౌదరీ మాట్లాడుతూ, కాదంబరి కిరణ్ పదేళ్లుగా చేస్తున్న సేవలపై ప్రశంసలు కురిపించారు. సేవారంగం నుంచి కాదంబరి కిరణ్, సినిమారంగం నుంచి జయసుధ, సంగీతం రంగం నుంచి విజిల్ రమణారెడ్డి, వైద్య రంగం నుంచి డాక్టర్ సాయిపద్మ అవార్డ్స్ అందుకున్నవారిలో ఉన్నారు.
కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, 'ఐశ్వర్యం అంటే మనిషికి సాటి మనిషి తోడుండటం. ఇతర జీవులు తోటి జీవులకు సాయపడుతాయి, కానీ మనిషి మాత్రం తన జీవితమంతా తన వారసులు మాత్రమే తన సంపాదన అనుభవించాలని ఆరాటపడుతాడు. ఒకరికొకరం సాయం చేసుకోకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కరోనా సమయంలో 50 వేల మంది నిస్సాహయులకు సాయం చేశాం. పేదలకు సేవ చేస్తే చిన్నపిల్లల కాళ్ళు అయినా మొక్కుతా, లేదంటే పరమ శివుడినైనా ఎదురిస్తా' అని ఈ సందర్భంగా అన్నారు. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా, 'మనంసైతం' కుటుంబం అండగా ఉంటుందని కాదంబరి కిరణ్ చెప్పారు.
ఈ సందర్భంగా జయసుధ ఫిలిపే అనే తన స్నేహితుడిగా ఈ వేడుకకి హాజరయ్యారు. అతను గత కొన్ని నెలలుగా జయసుధ తో పాటు అన్ని వేడుకలకి, సినిమా వేడుకలకి హాజరవుతూ కనిపిస్తున్నారు. (Jayasudha with Felipe Ruelas photo is going viral on social media) ఇప్పుడు ఈ వేడుకకి కూడా అతనితో వున్న ఫోటోలు వైరల్ అవుతూ వున్నాయి.