డాక్యుమెంటరీగా బావుంటుందేమో
ABN, Publish Date - Nov 24 , 2024 | 01:11 AM
‘నాన్నగారి బయోపిక్ గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంది. ఆయన జీవిత గాథను సినిమాగా కన్నా డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుందేమో’ అని అక్కినేని నాగార్జున...
‘నాన్నగారి బయోపిక్ గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంది. ఆయన జీవిత గాథను సినిమాగా కన్నా డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుందేమో’ అని అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డారు. గోవాలోని పణజీలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫ్ఫీ)లో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు శతాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ‘నాన్నగారి జీవితాన్ని సినిమాగా రూపొందించాలంటే చాలా కష్టం. నటుడిగా ఆయన జీవితంలో వెనకడుగు లేదు. అలాంటి దాన్ని తెరపైన చూపాలంటే బోర్ కొడుతుందేమో! ఒడిదొడుకులు చూపిస్తేనే సినిమా బాగుంటుంది. అందుకే ఆయన జీవిత కథకు కొంత కాల్పనికతను జోడించి డాక్యుమెంటరీగా రూపొందించాలి’ అని చెప్పారు. ‘ఆయన సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. తొలినాళ్లలో స్త్రీ పాత్రలు పోషించినప్పుడు ఎంతో మంది హేళనకు గురయ్యారు. ఓసారి ఆ బాధతో మెరీనా బీచ్‌కు వెళ్లి సముద్రంలో దూకి చనిపోవాలనుకున్నారట. కానీఅవమానాలను విజయ సోపానంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో క్లిష్టమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు’ అని అన్నారు.
వాళ్లిద్దరినీ నేనే కలిపానేమో
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమ గురించి నాగార్జున మాట్లాడుతూ ‘శోభిత అద్భుతమైన నటి, ఓ సినిమాలో ఆమె నటన బాగా నచ్చి, ఫోన్ చేసి అభినందించా. నా ఆహ్వానం మేరకు తను ఓ సారి మా ఇంటికి వచ్చింది. సినిమాలతో పాటు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి మేం మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో చైతన్య అక్కడకు వచ్చాడు. అప్పుడే వారిద్దరికి తొలిపరిచయం ఏర్పడింది. అలా వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడానికి నేనే కారణమయ్యానేమో’ అని చెప్పారు. ‘డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియో ్‌సలో జరగనున్న పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొద్దిమందినే ఆహ్వానిస్తున్నాం. చైతూ, శోభిత పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు’అని చెప్పారు.