నా కెరీర్‌లో కల్కి లాంటి సినిమా చేయలేదు

ABN, Publish Date - Jun 20 , 2024 | 02:30 AM

‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో భాగమవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇదో కొత్త ప్రపంచం, నా కెరీర్‌లో ఇప్పటిదాకా ఇలాంటి సినిమా చేయలేదు. ‘కల్కి’ చిత్రీకరణలో అనుభవాలను...

తన పాదాలకు నమస్కరించబోతున్న అమితాబ్‌ను వారిస్తున్న అశ్వనీదత్‌

‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో భాగమవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇదో కొత్త ప్రపంచం, నా కెరీర్‌లో ఇప్పటిదాకా ఇలాంటి సినిమా చేయలేదు. ‘కల్కి’ చిత్రీకరణలో అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రమిది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ సహా పలువురు అగ్రనటులు కీలకపాత్రలు పోషించారు. దీపికా పదుకొనే, దిశాపటానీ కథానాయికలు. వైజయంతీ మూవీస్‌ బేనర్‌పై సి. అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదలవుతోంది. బుధవారం ముంబైలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ మాట్లాడుతూ ‘ఓ వినూత్నమైన చిత్రానికి రూపకల్పన చేసిన నాగ్‌ అశ్విన్‌, అతని బృందానికి నా అభినందనలు. ఆయన ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. అయన ఇలాంటి కథని ఎలా ఆలోచించగలిగాడో అనిపించింది. ఈ చిత్రంలో విజువల్స్‌ అసాధారణంగా ఉంటాయి. తన ఆలోచనలను తెరపైన అద్భుతంగా ఆవిష్కరించగలిగాడు. ఈ ఫ్యూచరిస్టిక్‌ ప్రాజెక్ట్‌ ఓ మహా అద్భుతం’ అని నాగ్‌ అశ్విన్‌ను ప్రశంసించారు.


కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ‘నాగ్‌ అశ్విన్‌ కూడా మా గురువుగారు బాలచందర్‌లా సాదాసీదాగా కనిపిస్తాడు కానీ అసాధారణ ప్రజ్ఞావంతుడు. తన ఆలోచనలను సృజనాత్మకంగా తెరకెక్కించగల నేర్పు నాగ్‌ అశ్విన్‌లో అపారంగా ఉంది. ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్ర నాది. మంచి వినోదం పంచుతుంది. నా ఫస్ట్‌లుక్‌లానే సినిమా కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది’ అన్నారు.

ప్రభాస్‌ మాట్లాడుతూ ‘దిగ్గజాలతో పనిచేసే అవకాశం కల్పించిన అశ్వనీదత్‌, నాగీకి ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన తొలి భారతీయ నటుడు అమితాబ్‌బచ్చన్‌. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నా చిన్నప్పుడు కమల్‌హాసన్‌ గారి సినిమాలు చూసి ఆయనలా నటించేవాణ్ణి. దీపిక అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇంతమంది గొప్ప నటులతో కలసి నటించానంటే నమ్మలేకపోతున్నాను’ అని చెప్పారు.


దీపికా పదుకొనే మాట్లాడుతూ ‘నాగీ క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌ ‘కల్కి’ చిత్రం. ఆయనో జీనియస్‌. తనలో చాలా స్పష్టత ఉంది. సినిమాను అద్భుతంగా తీశారు. నటిగా నాకు గొప్ప అనుభవం మిగిల్చిన సినిమా ఇది’ అన్నారు.

అశ్వనీదత్‌ మాట్లాడుతూ ‘అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, ప్రభాస్‌, దీపిక సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆనందంగా ఉంది. ‘కల్కి’ గొప్ప విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 02:30 AM