మాలీవుడ్‌లో కీచకులు
ABN, Publish Date - Aug 27 , 2024 | 04:41 AM
ఒకప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమ అంటేనే బూతు సినిమాలు.. చవకబారు సినిమాలు.. అనే తేలిక అభిప్రాయం ఉండేది. కేరళలోనే కాదు ఇతర భాషల్లోనూ మలయాళ చిత్రాలకు మంచి డిమాండ్ ఉండేది. భాష తెలియకపోయినా ఆ సినిమాల్లోని సీన్లకోసం ప్రేక్షకులు...
మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్
పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్
ఒక్కరోజే పలువురు నిర్మాతలు, నటులపై ‘మీ టూ’ ఆరోపణలు
నటుడు సిద్దిఖీ నా దృష్టిలో క్రిమినల్: రేవతి సంపత్
నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడు
దర్శకుడు తులసీదాస్‌పై నటి గీతావిజయన్ నిప్పులు
రంజిత్ బాలకృష్ణ నన్ను హోటల్ గదికి రమ్మన్నాడు
తీవ్రస్థాయిలో మండిపడ్డ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర
ఐదుగురి వేధింపులు తట్టుకోలేక తాను చెన్నైకి
వెళ్లిపోయానంటూ నటి మీను మునీర్ ఆవేదన
నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవట్లేదు
నేను ఐదేళ్ల కెరీర్ కోల్పోయా: చిన్మయి ఆవేదన
ఒకప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమ అంటేనే బూతు సినిమాలు.. చవకబారు సినిమాలు.. అనే తేలిక అభిప్రాయం ఉండేది. కేరళలోనే కాదు ఇతర భాషల్లోనూ మలయాళ చిత్రాలకు మంచి డిమాండ్ ఉండేది. భాష తెలియకపోయినా ఆ సినిమాల్లోని సీన్లకోసం ప్రేక్షకులు ఎగబడే వారు.. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి హీరోలు ఉన్నా షకీలా లాంటి శృంగార తారలు అప్పట్లో ఒక వెలుగు వెలిగారు. వారి సినిమాలకంటే షకీలా సినిమాలే ఎక్కువ కలెక్ట్ చేసేవి. అయితే క్రమేపీ ఆ ముద్ర నుంచి బయటపడింది మలయాళ చిత్ర పరిశ్రమ. కొత్త రకం కథలతో.. సహజత్వం ఉట్టిపడే సినిమాలతో మిగతా అందరి దృష్టినీ ఆకర్షించగలిగింది. అంతే కాదు ప్రయోగాత్మక చిత్రాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కోసం మలయాళం సినిమాలే చూడాలి అనే స్థాయికి ఎదిగిందీ పరిశ్రమ. అవార్డులతో పాటు రివార్డులూ పొందింది. అయితే 2017లో జరిగిన ఓ సంఘటన మలయాళ చిత్ర పరిశ్రమ ప్రతిష్టను దెబ్బ తీసింది. తెలుగు వారికీ పరిచయమైన హీరోయిన్ భావనపై జరిగిన లైంగిక దాడి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ దాడి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ముందుకు వచ్చి, 2008లో నటుడు నానా పాటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని వెల్లడించి ఇండియాలో ‘మీ టూ’ ఉద్యమానికి నాంది పలికింది. ఇక అప్పటి నుంచి ఈ ఉద్యమం మిగిలిన చిత్ర పరిశ్రమలకూ పాకింది. లైంగిక వేధింపులను బట్టబయలు చేసింది. ఉప్పెనలా ఎగసిన ఈ ఉద్యమం అప్పట్లో చాలా మందికి నిద్ర పట్టకుండా చేసింది,
అప్పటి నివేదిక ఇప్పుడు వెలుగులోకి..
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ఏడేళ్ల పాటు పరిశీలించి, జస్టిస్ హేమ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. మళ్లీ ధైర్యంగా హీరోయిన్లు ముందుకు వచ్చి, తమపై లైంగిక దాడికి ప్రయత్నించిన వారి చిట్టా బయట పెడుతున్నారు.
జస్టిస్ హేమ కమిటీ... నివేదిక
2017లో నటి భావనపై కొందరు దుండగులు కారులో లైంగిక దాడికి పాల్పడిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. కారులో ఆమెను పలు చోట్లకు తిప్పుతూ దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ ఘటనలో మలయాళ అగ్రహీరో దిలీప్ కీలక నిందితుడు. ఆ సంఘటన తర్వాత మలయాళ పరిశ్రమలో మహిళలపై వేధింపులకు సంబంధించి నివేదిక ఇవ్వాలని 2019లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ హైకోర్టు న్యాయమూర్తి కే.హేమ ఈ కమిటీకి చైర్ పర్సన్‌గా ఉన్నారు. సీనియర్ నటి శారద, ఐఏఎస్ అధికారిణి కేబీ వల్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. కమిటీ తమ నివేదికను నాలుగేళ్ల క్రితమే ప్రభుత్వానికి సమర్పించినా, సున్నితమైన అంశాలున్నాయనే సాకుతో అందులోని విషయాలు బయటక రాకుండా ఇన్నాళ్లూ ప్రభుత్వం తొక్కిపట్టింది. సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన ఈ నివేదికలో పలు విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. నివేదిక ఇచ్చి నాలుగేళ్లయినా చర్యలు శూన్యమన్న ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. మహిళలపై వేధింపులను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని హామీనిచ్చారు. ఈ మేరకు ఓ స్పెషల్ కమిటీని కేరళ ప్రభుత్వం నియమించింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు ఓ ఐ.ఏ.ఎస్ అధికారిణి ప్రాతినిధ్యం వహిస్తారు.
ఐదేళ్ల కెరీర్ కోల్పోయా
‘‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సాధ్యమైంది. ఇప్పటివరకూ ఇలాంటిది ఏ పరిశ్రమలోనూ జరగలేదు. ప్రతీ ఇండస్ర్టీలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయనేది బహిరంగ రహస్యం. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు సాధ్యమని అందరూ భావిస్తుంటారు. ఇలాంటి ఘటన జరిగిందని చెప్పినా నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడం లేదు. కొన్నేళ్లపాటు కేసు నడుస్తూనే ఉంటుంది. రాజకీయ బలం, డబ్బు వల్ల ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని శిక్షించడం కష్టంగా మారింది’’ అని చిన్మయి ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె గతాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఆయన గురించి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడినందుకు నాకు ఆ పరిశ్రమలో వర్క్ లేకుండా చేశాడు. కాగా, విదేశాల్లో ఓ సంగీత కార్యక్రమం నిమిత్తం వెళ్లినప్పుడు సీనియర్ గీత రచయిత వైర ముత్తు తనని వేధింపులకు గురి చేశారని ‘మీటూ’ ఉద్యమ సమయంలో ఆమె కామెంట్స్ చేశారు. ఆయన చెప్పిన మాటలు విననందుకు తన కెరీర్‌పైనే దెబ్బ కొట్టారని చిన్మయి ఆరోపించారు. ఈ క్రమంలోనే తమిళ పరిశ్రమ చిన్మయిని దాదాపు ఐదేళ్లు బ్యాన్ చేసింది. నిషేధం తర్వాత ఆమె ‘లియో’ చిత్రంలో త్రిష పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
నాతో అసభ్యంగా ప్రవర్తించాడు
బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర మలయాళ చిత్ర దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై ఆరోపణలు చేశారు. 2009లో రంజిత్ దర్శకత్వం వహించిన ‘‘పలేరి మాణిక్యం: ఒరు పతిర కోలపతకతింటే కథ’’ సినిమా ఆడిషన్ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెల్లడించారు. ‘‘నాకు సినిమా అవకాశం ఇస్తానని, సినిమా గురించి చర్చించేందు దర్శకుడు రంజిత్ నన్ను హోటల్ గదికి రమ్మన్నారు. గదిలోకి వెళ్లిన తర్వాత నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో షాక్ గురై అక్కడ నుంచి బయటకు వచ్చేశాను’’ అని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. ‘‘నటి శ్రీలేఖ నాపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు. నిజానికి ఈ విషయంలో అసలు బాధితుడ్ని నేను. నాపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో నేను ఈ పదవిలో ఉండటం సముచితం కాదు. నాపై వస్తున్న ఆరోపణలను నేను లీగల్‌గా ఎదుర్కొని.. నా తప్పు లేదని నిరూపించుకుంటా’’ అని ఓ టెలివిజన్ చానల్‌కు పంపిన ఆడియో రికార్డ్‌లో పేర్కొన్నారు.
వేధింపులు ఎదుర్కొన్నా
మరో మలయాళి నటి మీను మునీర్ తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘మలయాళ పరిశ్రమకు చెందిన నటులు ముఖేశ్, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు, జయసూర్య, ప్రొడక్షన్ కంట్రోలర్ నోబల్, విచు వల్ల నేను ఎంతో మానసిక క్షోభ అనుభవించాను. వారు అసభ్యపదజాలంతో నన్ను దూషించేవారు. షూటింగ్ సమయంలో జయసూర్య నా వెనుకనుంచి బలవంతంగా హత్తుకుని, ముద్దుపెట్టుకున్నాడు. ఇవన్నీ తట్టుకోలేక నేను మలయాళ ఇండస్ట్రీని వదిలి చెన్నైకు వచ్చేశా. నాకీ విషయంలో న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వారు చేసిన పనికి తగిన శిక్ష పడాలి’’ అని పేర్కొన్నారు.
నా దృష్టిలో సిద్ధిఖీ.. ఓ క్రిమినల్
మలయాళ నటుడు సిద్ధిఖీ తనతో అసభ్యంగా ప్రవర్తించారని మలయాళ నటి రేవతి సంపత్ ఆరోపణలు చేశారు. ‘‘కొన్నేళ్ల క్రితం నటుడు సిద్ధిఖీ.. ఓ సినిమా కోసం నన్ను కలవాలని ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టారు. కూతురనే అర్థం వచ్చేలా ఆయన పిలవడంతో నేను ఆయనని సంప్రదించా. ఆయన నన్ను శారీరకంగా, మానసికంగా బాధించారు. నా దృష్టిలో ఆయనొక క్రిమినల్. దీని వల్ల నా కెరీర్ కూడా దెబ్బతింది. ఇప్పటికి ఈ విషయంపై మాట్లాడ్డానికి ధైర్యం వచ్చింది’’ అని పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సిద్ధిఖీ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవికి రాజీనామా చేశారు.
ఇండస్ట్రీలో లేకుండా చేస్తానన్నారు
నటి గీతా విజయన్ మలయాళ చిత్ర దర్శకుడు తులసీ దాస్‌పై ఆరోపణలు చేశారు. ‘‘చంచట్టం’ సినిమా షూటింగ్‌లో తులసీ దాస్ నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేనుండే రూమ్ తలుపు కొడుతుండేవాడు. నేను ఆ పద్థతిని తప్పుపట్టినందుకు షూటింగ్‌లో ఆయన నాకు డైలాగులు చెప్పేవారు కాదు. ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించేవారు’’ అని గీత ఆరోపించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తప్పుకోవాలి
హేమ కమిటీ నివేదికపై.. మలయాళ పరిశ్రమలోని ప్రముఖులపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. ‘‘అధికారంలో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పదవుల నుంచి తప్పుకోవాలి. నిందితులపై విచారణ జరిపి.. దోషలని తేలితే కఠినంగా శిక్షించాలి. ఈ నివేదికలో వెల్లడించిన అంశాలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే పరిశ్రమలో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం మన కనీస బాధ్యత. అందుకు నేను ముందుంటా. అయితే అది నా ఒక్కడి బాధ్యత కాదు. అందరూ ఈ పద్థతిని అనుసరించాలి’’ అని పేర్కొన్నారు.