తుది దశలో హరి హర వీరమల్లు
ABN, Publish Date - Nov 29 , 2024 | 06:11 AM
పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 - స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంలో విజయవాడలో తుది షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రేక్షకులకు...
పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 - స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంలో విజయవాడలో తుది షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రేక్షకులకు ప్రత్యేకమైన, మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బేనర్‌పై ఎ.దయాకర్ రావు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల మహారాష్ట్రలో పర్యటించారు. ఆయన సభలకు అక్కడి ప్రజల నుంచి విశేష జనాధరణ లభించింది. ఈ సందర్భంగా ‘హరి హర వీరమల్లు’ చిత్రం గురించి తెలుసుకునేందుకు ఆసక్తిని చూపించారు. సినిమా విడుదల కోసం ఎదరు చూస్తున్నామని వారు చెప్పారు. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకొని దర్శకుడు జ్యోతి కృష్ణ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
విజయవాడలో ప్రారంభం కానున్న షెడ్యూల్‌లో కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రీకరణలో పవన్ కళ్యాణ్‌తో పాటు 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్‌తో ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని మేకర్స్ తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.