పాటల ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన గురుచరణ్‌

ABN, Publish Date - Sep 13 , 2024 | 04:39 AM

‘ముద్దబంతి నవ్వులో మూగ బాసలు’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిల’, ‘ముసిముసి నవ్వుల లోన..’ ‘నీక్కావాల్సింది నా దగ్గర ఉంది’ వంటి మెలోడీ సాంగ్స్‌ రాసిన గురుచరణ్‌ (77) ఇక లేరు...

‘ముద్దబంతి నవ్వులో మూగ బాసలు’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిల’, ‘ముసిముసి నవ్వుల లోన..’ ‘నీక్కావాల్సింది నా దగ్గర ఉంది’ వంటి మెలోడీ సాంగ్స్‌ రాసిన గురుచరణ్‌ (77) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం కన్నుమూశారు. గురుచరణ్‌ అసలు పేరు మానాపురం రాజేంద్రప్రసాద్‌. ఎన్టీఆర్‌, శోభన్‌బాబు నటించిన పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన పాత తరం దర్శకుడు మానాపురం అప్పారావు తనయుడే ఈ రాజేంద్రప్రసాద్‌. వాళ్ల అమ్మగారు ఎం.ఆర్‌. తిలకం కూడా నటీమణే. (ఎన్టీఆర్‌ నటించి, నిర్మించిన ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రంలో ‘పోవు చున్నావా యమధర్మ రాజా’ పాట పాడింది ఆవిడే) ఎం.ఎ. చదివిన గురుచరణ్‌ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. గురువు మీద గౌరవంతో ‘గురుచరణ్‌’ అని తన పేరు మార్చుకుని, ఆ పేరుతోనే పరిశ్రమలో కొనసాగారు. మోహన్‌బాబు నిర్మించిన ‘అల్లుడుగారు’ గీత రచయితగా గురుచరణ్‌ తొలి చిత్రం. ‘ముద్దబంతి నవ్వులో మూగ బాసలు’ ఆయన రాసిన తొలి పాట.


గురుచరణ్‌ అంటే మోహన్‌బాబుకు ఎంతో అభిమానం. తను నిర్మించిన ప్రతి చిత్రంలోనూ గురుచరణ్‌తో కనీసం ఒక పాటన్నా రాయించేవారు. రెండు వందలకు పైగా పాటలు రాసిన గురుచరణ్‌ కొన్ని అనువాద చిత్రాలకు మాటలు కూడా రాశారు. గురుచరణ్‌కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 04:39 AM