గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్‌స్టర్స్
ABN, Publish Date - Sep 18 , 2024 | 05:08 AM
కథానాయకులు ఒకప్పుడు రాముడు మంచి బాలుడు తరహా పాత్రలు మాత్రమే చేయడానికి ఆసిక్తి చూపేవారు. ఆ తర్వాత గ్రే షేడ్స్ ఉన్న పాత్రలకు సైతం సై అని బాక్సాఫీస్‌కు కళ తెచ్చారు. 1970 దశకంలో మొదలైన ఈ హడావుడి. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్...
కథానాయకులు ఒకప్పుడు రాముడు మంచి బాలుడు తరహా పాత్రలు మాత్రమే చేయడానికి ఆసిక్తి చూపేవారు. ఆ తర్వాత గ్రే షేడ్స్ ఉన్న పాత్రలకు సైతం సై అని బాక్సాఫీస్‌కు కళ తెచ్చారు. 1970 దశకంలో మొదలైన ఈ హడావుడి. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ ఫార్ములాగా వెండితెరను ఏలుతోంది. డాన్.. గ్యాంగ్‌స్టర్.. బూట్ లెగ్గర్ ఇలా ఎన్ని పేర్లతో ఈ పాత్రలు తెరపైకి వచ్చినా.. కథానాయకులు మాత్రం ఈ రోల్‌లో ఒక్కసారి అయినా కనిపించాలని కోరుకుంటుంటారు. కొందరు కథానాయకులు అయితే ఇదే తరహా పాత్రలకు బ్రాండ్‌గా మారిన సందర్భాలూ అనేకం. అలా త్వరలో వెండితెరపై తళుక్కుమననున్న గ్యాంగ్‌స్టర్ పాత్రధారులెవరో ఓ లుక్కేద్దాం.
సుజీత్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘దే కాల్ హిమ్ ఓజీ’. ఇందులో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. జపాన్..కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై అంచనాలు ఇప్పటికే పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదలై సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రేక్షకులకు హింటిచ్చింది. ఇది వరకే ‘బాలు’, ‘పంజా’ చిత్రాలలో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మొదట ఈ నెల 27న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆంధ్రపదేశ్ డిప్యూటి సీఎంగా పవన్ ఎన్నికవ్వడం.. ఆయన రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తుండడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది దానిపై మేకర్స్ నుంచి అప్‌డేట్ లేదు.
8 అచ్చొచ్చిన పాత్రలో...
తమిళ నటుడు అజిత్ ఇప్పటివరకూ ఎన్నో పాత్రల్లో కనిపించారు. అయితే, గ్యాంగ్‌స్టర్ పాత్రలతో ఆయన తనకంటూ విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పటికే ‘బిల్లా’, ‘బిల్లా 2’, ‘గ్యాంబ్లర్’ వంటి పలు చిత్రాల్లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి మెప్పించారు. ఇప్పుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ ఆయన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాలో అజిత్ పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయనే హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
8 ఖురేషీ అబ్రహంగా
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన దాదాపు అరడజనుకుపైగా సినిమాల్లో ఆయన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. 2019లో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన చిత్రం ‘లూసీఫర్’. ఆయన ఇందులో సినిమా మొదటి నుంచి చివరి వరకు స్టీఫెన్ గట్టుపల్లి అనే రాజకీయనాయకుడి పాత్రలో కనిపిస్తారు. సినిమా ఎండ్ క్రెడిట్స్‌లో ఆయన గ్యాంగ్‌స్టర్ ఖురేషీ అబ్రహంగా కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు. ఇప్పుడు ఖురేషీ పాత్రపై ‘లూసీఫర్’కు సీక్వెల్‌గా ‘ఎల్ 2 ఎంపురాన్’ అనే చిత్రం వస్తోంది. ఎంపురాన్ అంటే రాజుకు ఎక్కువ.. దేవుడికి తక్కువ అనే అర్థం వచ్చేలా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
8 డెడ్లీ డాన్‌గా...
తమిళ సినిమాల్లో డాన్ పాత్రను పోషించాలంటే టక్కున గుర్తొచ్చే నటుల్లో సూపర్‌స్టార్ రజనీ ఒకరు. ఆయన ఇది వరకే ‘రంగా’, ‘బిల్లా’, ‘బాషా’ ‘కాలా’ ‘కబాలి’ వంటి చిత్రాల్లో గ్యాంగ్‌స్టర్‌గా అదరగొట్టారు. ఆయన నటిస్తున్న లేటేస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో రజనీకాంత్ డెడ్లీ డాన్‌గా కనిపించనున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో నాగార్జున ‘సైమన్’ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
8 రోలెక్స్‌గా..
తమిళ నటుడు సూర్య ప్రతీ చిత్రంతో తన వైవిధ్యమైనన నటనతో అలరిస్తుంటారు. తను ఎంచుకునే పాత్రల్లో ఎన్నో షేడ్స్ చూపించే ఆయన.. ఇది వరకే ‘ఆరు’, ‘నంద’, ‘సికందర్’ సినిమాల్లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి రాణించారు. ఇప్పుడు ఆయన లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా.. ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్‌లో ‘రోలెక్స్’గా కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన తెరపై కనిపించింది ఐదు నిమిషాలే అయినా.. ఆ కొద్దిసేపటికే థియేటర్లు ‘రోలెక్స్’.. ‘రోలెక్స్’ అంటూ దద్దరిల్లాయి. ‘రోలెక్స్’ క్యారెక్టర్‌తో రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నారు లోకేశ్. ఈ సినిమాల్లోనే కాకుండా ఆయన.. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలోనూ గ్యాంగ్‌స్టర్‌గా మెరవనున్నారు. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ‘సూర్య 44’. అలాగే, సుధా కొంగర దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలోనూ సూర్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారని టాక్.
8 పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా
తమిళ నటుడు కార్తీ కూడా ఓ గ్యాంగ్‌స్టర్ చిత్రంలో నటిస్తున్నారు. ‘కార్తీ 29’ వర్కింగ్ టైటిల్‌గా తమిళ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆయన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా వచ్చే ఏడాది ప్రేక్షకులను పలకరించనుంది.