Kalki 2898 AD : కృష్ణ నిర్యాణం నుంచి కల్కి అవతారం వరకు
ABN, Publish Date - Feb 27 , 2024 | 05:02 AM
దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ కథానాయకుడు కావడం, కమల్‌హాసన్ ప్రతినాయకుడిగా కనిపించనుండడం సినిమాపై క్రేజ్‌ను పెంచాయి...
దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ కథానాయకుడు కావడం, కమల్‌హాసన్ ప్రతినాయకుడిగా కనిపించనుండడం సినిమాపై క్రేజ్‌ను పెంచాయి. ఇక ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు పొందిన నాగ్‌అశ్విన్ విజన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఊహకు అందని స్థాయిలో ఆయన ‘కల్కి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ప్రచార చిత్రాలతోనే తెలుస్తోంది. ఆయన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ‘కల్కి’ కథకు సంబంధించిన విశేషాలను వివరించారు. ‘మహాభారత గాథ, ‘స్టార్ వార్స్’ సినిమాలు నాకు చాలా ఇష్టం. ఈ రెండు విభిన్న ప్రపంచాలను కలుపుతూ ఓ సినిమా చేయాలనే ఆలోచనలోంచి ‘కల్కి’ చిత్రం పుట్టింది. ఈ సినిమా కథ మహాభారత కాలం నాటి శ్రీకృష్ణ నిర్యాణంతో మొదలై కల్కి అవతారం వరకూ సాగుతుంది. అందుకే టైటిల్ అలా పెట్టాం. మొత్తం ఆరు వేల సంవత్సరాల కథ ఇది. గతం నుంచి భవిష్యత్తులోకి చేసే ప్రయాణం. మున్ముందు ప్రపంచం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాం. దానికోసం అద్భుతమైన ఊహా ప్రపంచాన్ని సృష్టించాం. ‘బ్లేడ్ రన్నర్’ లాంటి హాలీవుడ్ చిత్రానికి అనుకరణగా అనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం సవాల్‌గా అనిపించింది. ఏఐ టెక్నాలజీ ఉపయోగించకుండా మా సృజనకు పదునుపెట్టి చాలా కష్టపడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’ అని చెప్పారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దిశాపటానీ, దీపికా పదుకొనే కథానాయికలు. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.