హీరో లేకుండా హిట్‌ కోసం

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:37 AM

ఒకప్పుడు వరుస సినిమాలు చేసి అగ్రనటిగా వెలుగొందిన నటి సమంత. ఇప్పుడు ఆమె నటించిన వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ ‘హనీబన్నీ’ స్ట్రీమింగ్‌ అవనున్న సంగతి తెలిసిందే. అలానే ఆమె ఓ నూతన ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్నారు....

ఓ పక్క హీరోలతో ఆడిపాడుతూనే.. వారికి ధీటైన పాత్రల్లోనూ నటిస్తున్నారు నేటితరం కథానాయికలు. మహిళా ప్రాధాన్య కథలతో వచ్చే సినిమాల సంఖ్య ఇండస్ట్రీలో గతంలో కన్నా ఎక్కువగానే ఉంది. ద ర్శకులు కూడా హీరోయిన్ల కోసం సరికొత్త పాత్రలు సృష్టిస్తున్నారు. లీడ్‌ రోల్‌లో నటిస్తూ సినిమా భారాన్నంతా తమ భుజాలపైనే మోస్తున్న టాలీవుడ్‌ కథానాయికల గురించి తెలుసుకుందాం.

ఒకప్పుడు వరుస సినిమాలు చేసి అగ్రనటిగా వెలుగొందిన నటి సమంత. ఇప్పుడు ఆమె నటించిన వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ ‘హనీబన్నీ’ స్ట్రీమింగ్‌ అవనున్న సంగతి తెలిసిందే. అలానే ఆమె ఓ నూతన ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్నారు. మహిళా ప్రాధాన్యమున్న ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో ఓ శక్తిమంతమైన ఇల్లాలి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాతో సామ్‌ నిర్మాతగా కూడా మారారు. సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆమె ఇది వరకే మహిళా ప్రాధాన్యం ఉన్న ‘యశోదా’, ‘శాకుంతలం’ చిత్రాల్లో నటించారు.


ప్రతీకారంతో స్వీటీ

సినిమాల్లో మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఊపు తెచ్చారు అనుష్క శెట్టి. ‘బాహుబలి’లో దేవసేన, ‘వేదం’లో సరోజ పాత్రలు అలాంటివే. ఆమె అలాంటి పవర్‌ఫుల్‌ పాత్రలు పోషిస్తూనే ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ ‘సైజ్‌ జీరో’ లాంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లోనూ నటించారు. ఆమె ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ‘ఘాటి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఓ మహిళ జీవితంలో తనకెదురైన గడ్డు పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.

రివాల్వర్‌ తో ‘మహానటి’

‘మహానటి’ చిత్రంతో అందరి చేత శభాశ్‌ అనిపించుకోవడమే కాక జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు కీర్తి సురేశ్‌. ఆ తర్వాత ఆమె ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌ లక్‌ సఖి’, ‘రఘు తాత’ వంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్‌ సరసన ‘బేబీ జాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ‘రివాల్వర్‌ రీటా’లో నటిస్తున్నారు. ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్‌లో ఆమె పూర్తి మాస్‌ పాత్రలో కనిపించారు.


ఒకేసారి రెండు చిత్రాల్లో...

హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల విషయంలో రష్మిక మందన్న ఓ అడుగు ముందే ఉన్నారు.ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘గర్ల్‌ ఫ్రెండ్‌’, ‘రెయిన్‌బో’ చిత్రాలు రెండూ ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రాలతో పాటు ‘కుబేర’, ‘సికందర్‌’, ‘ఛావా’ వంటి సినిమాల్లో కథానాయికగా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారీ బ్యూటీ. మరోవైపు ‘పుష్ప 2’లో ఆమె పోషిస్తున్న శ్రీవల్లి పాత్ర కూడా మొదటి భాగం కంటే మరింత శక్తిమంతంగా ఉండనున్నదట.

తొలిసారి...

‘సార్‌’ సినిమాలో ‘మాస్టారు మాస్టారు’ అంటూ యువకుల హృదయాలను కొల్లగొట్టిన నటి సంయుక్త. ఆమె తొలిసారి ఓ మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను ప్రారంభించారు. సామాజిక, రాజకీయ అంశాలే ప్రధానంగా తెరకెక్కుతోందీ సినిమా.


ట్రావెల్‌ నేపథ్యంలో..

ఇటీవలే ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌. ఆమె ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కాండ్రీగుల దర్శకత్వంలో ‘పరదా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ ట్రావెల్‌ బేస్డ్‌ చిత్రంలో ‘హృదయం’ ఫేమ్‌ దర్శనా రాజేందర్‌ కూడా కీలక పాత్రలో మెరుస్తున్నారు.

పంథా మార్చి...

ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన తమన్నా.. తన పంథా మార్చి మొదటి సారి మహిళా ప్రాధాన్యత ఉన్న ఓ పాత్రను పోషిస్తున్నారు. ‘ఓదెల 2’ చిత్రంలో ఆమె శివశక్తి అనే నాగసాధువు పాత్రను పోషిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఆమె లుక్‌ అందర్నీ ఆకట్టుకుంది.

ఎనిమిదేళ్ల ప్రయాణం..

‘మ్యాడ్‌’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు అనంతిక సనీల్‌కుమార్‌. ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వంలో ఆమె ఓ విమెన్‌ ఓరియెంటెడ్‌ చిత్రం ‘8 వసంతాలు’లో నటిస్తున్నారు. ఇందులోని ‘శుద్ధి అయోధ్య’ పాత్ర కోసం ఆమె మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ పొందారు.


వీరితో పాటు మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఆది పర్వం’.. శ్రద్ధాదాస్‌ నటిస్తున్న ‘త్రికాల’.. ప్రియమణి నటిస్తున్న ‘క్యూజీ గ్యాంగ్‌’.. హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న హారర్‌ థ్రిల్లర్‌ ‘గాంధారీ’.. వంటి చిత్రాలు కూడా కథానాయిక ప్రాధాన్యం ఉన్నవే.

Updated Date - Oct 21 , 2024 | 08:45 AM