లైంగిక వేధింపులకు పాల్పడితే ఐదేళ్ల నిషేధం

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:22 AM

నడిగర్‌ సంఘం మహిళా భద్రతా కమిటీలో తీర్మానం నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రుజువైతే చిత్రపరిశ్రమలో పనిచేయకుండా ఐదేళ్ళపాటు నడిగర్‌ సంఘం నిషేధం విధించనుంది. ఈ మేరకు నడిగర్‌ సంఘం అనుబంధ విభాగమైన...

నడిగర్‌ సంఘం మహిళా భద్రతా కమిటీలో తీర్మానం నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రుజువైతే చిత్రపరిశ్రమలో పనిచేయకుండా ఐదేళ్ళపాటు నడిగర్‌ సంఘం నిషేధం విధించనుంది. ఈ మేరకు నడిగర్‌ సంఘం అనుబంధ విభాగమైన మహిళా భద్రతా కమిటీ సమావేశంలో తీర్మానించారు. ఈ కమిటీ సమావేశం బుధవారం నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌, ఉపాధ్యక్షుడు పూచ్చి మురుగన్‌, కోశాధికారి కార్తీ, కమిటీ అధ్యక్షురాలు రోహిణి సారథ్యంలో కమిటీ సభ్యులు సుహాసిని, ఖుష్బూ, లలిత కుమారి, కోవై సరళ తదితరులు పాల్గొన్నారు. ఇందులో కొన్ని తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిపై విచారణ జరిపి నిజమని తేలితే చిత్ర పరిశ్రమలో పనిచేయకుండా ఐదేళ్ళపాటు నిషేధం విధించేలా తీర్మానం చేశారు.


బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు, న్యాయ సలహాలు ఇప్పించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని తొలుత హెచ్చరించి, ఆ తర్వాత చర్యలకు ఉపక్రమిస్తారు. కమిటీకి ఫిర్యాదు చేసే బాధితులు మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడకూడదు. యూట్యూబ్‌లో సినీ నటులను కించపరిచేలా మాట్లాడేవారిపై బాధితులు సైబర్‌ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారికి కమిటీ అన్ని విధాలా సహకరిస్తుంది.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 05 , 2024 | 03:22 AM