ప్రతి టిక్కెట్ ధరనుంచి ఐదు రూపాయలు అయోధ్య రామ మందిరానికి
ABN, Publish Date - Jan 08 , 2024 | 01:39 AM
‘చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే ఘట్టం అయోధ్య రామమందిర నిర్మాణం. అటువంటి గొప్ప ఆలయ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 22న కుటుంబ సమేతంగా రామ మందిర...
‘చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే ఘట్టం అయోధ్య రామమందిర నిర్మాణం. అటువంటి గొప్ప ఆలయ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 22న కుటుంబ సమేతంగా రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య వెళ్తున్నాను. ఈ ‘హను-మాన్’ సినిమాకు అమ్ముడుపోయిన ప్రతి టికెట్ నుంచి అయిదు రూపాయలు అయోధ్య రామమందిరానికి కానుకగా ఇవ్వనున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఇది నిజంగా హర్షణీయం’ అని చిరంజీవి అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ‘అమ్మానాన్నల తర్వాత నేను అమితంగా ఆరాధించే దైవం హనుమాన్. ఇది ఆయన నేపథ్యంతో కూడిన సినిమా కావడం నేను రావడానికి తొలి కారణమైతే, నా ముందు డైపర్‌లు వేసుకునే స్థాయినుంచి డయాస్ ఎక్కి మాట్లాడే స్థాయికి వచ్చిన తేజా ఇందులో హీరో కావడం మరొక కారణం. దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఇంకో కారణం. హనుమ అంటే ఒక ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ. థియేటర్లు తక్కువగా దొరికినా పర్లేదు. ఇది పరీక్షా సమయం. కంటెంట్ బావుంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని చిరంజీవి అన్నారు. ‘చిరంజీవిగారునా జీవితంలో లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడ్ని కాదు. నన్ను హీరోగా నిలబెట్టిన ప్రశాంత్‌వర్మ ఈ సినిమాతో నన్ను సూపర్‌హీరోని చేశాడు. రామ్‌చరణ్‌కి రాజమౌళీ, రవితేజకు పూరీజగన్నాథ్, ఈ తేజాకు ప్రశాంత్‌వర్మ అని సగర్వంగా చెబుతున్నా. నేను ఉత్సవవిగ్రహాన్ని మాత్రమే. మూలవిరాఠ్ ప్రశాంత్‌వర్మ..’ అని హీరో తేజా అన్నారు. ‘సినిమా తీయడం పెద్ద యుద్ధం. ఈ యుధంలో నేను వాడిన ఆయుధం తేజా. అందరూ కష్టపడి పనిచేశారు. ఇది హనుమంతులవారి కథ కాదు. ఒక సామాన్యుడికి ఆంజనేయ శక్తులొస్తే ధర్మంకోసం ఎలా పోరాడాడు అనేది ఈ కథ’ అని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. ఇంకా నిర్మాత నిరంజన్‌రెడ్డి, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, తదితరులు మాట్లాడారు.