వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళం

ABN, Publish Date - Sep 04 , 2024 | 03:34 AM

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు ప్రకటించారు...

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రూ. కోటి విరాళం ప్రకటించారు. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడును కలసి చెక్కు అందజేయనున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని అనుకున్నా, తన వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ఆయన చెప్పారు.


జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున మొత్తం రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. ‘భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం నన్ను కలచివేసింది, ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ఎన్టీఆర్‌ చెప్పారు. మహేశ్‌ బాబు సైతం రూ. కోటి సాయాన్ని ప్రకటించారు. వరదల్లో ముంపునకు గురైన ప్రజలు తొందర్లోనే కోలుకోవాలని, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ, ఎస్‌. నాగవంశీ కలసి రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 50 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు హీరో సిద్ధు జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 30 లక్షల సాయాన్ని ప్రకటించారు.


హీరో విష్వక్సేన్‌ రెండు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు. దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 10 లక్షలు, హీరోయిన్‌ అనన్య నాగళ్ల రూ. 5 లక్షల సాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వైజయంతి మూవీస్‌ రూ. 25 లక్షలు ప్రకటించగా, నిర్మాత బన్నీవాస్‌ ‘ఆయ్‌’ చిత్రం వసూళ్లలో పాతిక శాతాన్ని ఏపీ వరద బాధితులకు విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. సహాయనిధికి విరాళాలను ప్రకటించిన సినీ ప్రముఖులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సోషల్‌ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Sep 04 , 2024 | 03:34 AM