Tollywood box office: ఈవారం నాలుగు సినిమాలు, ప్రేక్షకులు వస్తారా...
ABN, Publish Date - Apr 30 , 2024 | 12:32 PM
ఈ శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. రోజంతా ఎన్నికల ప్రచార హడావిడిలో చాలామంది ఉంటే, సాయంత్రం అయ్యేసరికి ఐపీల్ మ్యాచులు ఉంటున్నాయి. ఇటువంటి సమయంలో విడుదలవుతున్న ఈ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు వస్తారా? అన్నది ప్రశ్న
వచ్చే శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో అల్లరి నరేష్ నటించిన 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాతో అంకం మల్లిక్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అలాగే 'ప్రసన్న వదనం' అనే సినిమా కూడా విడుదలవుతోంది. క్యారెక్టర్ నటుడిగా పరిచయమైన సుహాస్ కథానాయకుడిగా చేస్తూ వస్తున్న సినిమాలలో ఇదొకటి. సుకుమార్ దగ్గర పనిచేసిన అర్జున్ వైకె అనే అతను దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు.
తెలంగాణాలో కన్నా ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికల హడావిడి ఎక్కువగా వుంది, ఎందుకంటే అక్కడ పార్లమెంట్ తో పాటు, అసెంబ్లీ కి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అదీ కాకుండా, సాయంత్రం అయ్యేసరికి ఐపీల్ మ్యాచులు కూడా మొదలవుతున్నాయి, ఎండలు, ఇటువంటి సమయంలో ఈ రెండు సినిమాలకి అంతగా బిజినెస్ అవలేదని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. అందుకనే ఈ రెండు సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వచ్చి ఈ సినిమాలని కేవలం డిస్ట్రిబ్యూషన్ చెయ్యడానికి ఒప్పుకున్నారని తెలిసింది.
ఇదిలా ఉంటే తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన 'బాక్' సినిమా తెలుగులో కూడా విడుదలవుతోంది. తమన్నా, రాశి ఖన్నా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు, వాళ్ళు తెలుగు ప్రేక్షకులకి పరిచయమైనా వల్లీ. అదీ కాకుండా ఈ తెలుగు అనువాదం సినిమాలో వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి లను పెట్టినా, ఈ సినిమాకి అసలు బజ్ ఎక్కడా వినిపించలేదు అనే చెప్పాలి. ఇక వరలక్షి శరత్ కుమార్ నటించిన 'శబరి' కూడా ఈ వారమే విడుదలవుతోంది. ఈ సినిమా కూడా అనువాద సినిమాగానే చూస్తున్నారు తప్ప ఇది తెలుగు సినిమాగా ఎవరూ చూడటం లేదు. మిగతా మూడు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా విడుదలవుతున్నట్టు కూడా తెలీదు.
ఇక గత రెండు వారాల్లో తెలుగు సినిమాలు చిన్నవి చాలా విడుదలయ్యాయి కానీ, ఆలా వచ్చాయి, ఇలా వెళ్లిపోయాయి అన్నట్టుగా వాటి ఫలితం వుంది. ఏ సినిమా విడుదలయిందో కూడా తెలియని పరిస్థితి. కొన్ని థియేటర్స్ లో ప్రేక్షకులు లేక సినిమా ఆటలు రద్దు చేసిన సంఘటనలు కూడా వున్నాయి. ఇటువంటి సమయంలో ఇలా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో కొన్ని ఓటిటి బిజినెస్ అయిపోతే నిర్మాత కొంచెం సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో అతను థియేటర్ బిజినెస్ ఇప్పుడైతే ఏమీ ఆశించనక్కరలేదు, ఒక వేళ ఏదైనా సినిమా ఆడితే, అది అదృష్టమని చెప్పాలి.
మే 3 న విడుదలవుతున్న సినిమాలు
బాక్ (తమన్నా, రాశి ఖన్నా, దర్శకుడు: సుందర్ సి)
ఆ ఒక్కటి అడక్కు (అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, దర్శకుడు: అంకం మల్లిక్)
ప్రసన్నవదనం ( సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, దర్శకుడు: అర్జున్ వైకె)
శబరి (వరలక్ష్మి శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, దర్శకుడు: అనిల్ కాట్జ్)