15 రోజుల షూట్‌తో పూర్తి

ABN, Publish Date - Jul 03 , 2024 | 03:07 AM

‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం మరో 15 రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. ‘భారతీయుడు 2’ రిలీజవ్వగానే పెండింగ్‌ పార్ట్‌ను పూర్తి చేస్తాను. ‘గేమ్‌చేంజర్‌’, ‘భారతీయుడు’ చిత్రాల మధ్య పోలిక లేదు. అవి రెండూ పూర్తిగా వేటికవే...

‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం మరో 15 రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. ‘భారతీయుడు 2’ రిలీజవ్వగానే పెండింగ్‌ పార్ట్‌ను పూర్తి చేస్తాను. ‘గేమ్‌చేంజర్‌’, ‘భారతీయుడు’ చిత్రాల మధ్య పోలిక లేదు. అవి రెండూ పూర్తిగా వేటికవే భిన్నమైనవి. సీక్వెల్‌ చేయడానికి అవసరమైన మలుపులు ‘గేమ్‌ ఛేంజర్‌’ కథలో లేవు కాబట్టి అలాంటి ప్రయత్నమేదీ చేయడం లేదు’ అని దర్శకుడు శంకర్‌ అన్నారు. ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన ‘భారతీయుడు 2’ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శంకర్‌ మీడియాతో ముచ్చటించారు.

  • ‘భారతీయుడు’ చిత్రానికి మూడో పార్ట్‌ కూడా ఉంది. మరో ఆరునెలల్లో దాన్ని కూడా విడుదల చేస్తాం. పలు రాష్ట్రాల్లో జరిగే కథ కావడంతో నిడివి పెరిగింది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఎడిటింగ్‌లో ఒక్క సన్నివేశం కూడా తీసేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అందుకనే ‘భారతీయుడు 3’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.


  • భవిష్యత్‌లో జేమ్స్‌బాండ్‌ తరహా చిత్రాలు చేయాలనుకుంటున్నాను. అలాగే చారిత్రక, సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశాలతో సినిమాలు చేసే ఆలోచన ఉంది. వీఎఫ్‌ఎక్స్‌ను ఉపయోగించుకొని మంచి చిత్రాలు తెరకెక్కించే ఆలోచన ఉంది. ఆ సినిమాలు అందరినీ ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉంటాయి.

  • శంకర్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ క్రియేట్‌ చేయాలనే ఆలోచన వచ్చింది. దాని గురించి నా స్నేహితులు, సహాయ దర్శకులు, కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు ఎవ్వరూ పెద్దగా ఎగ్జైట్‌ అవ్వలేదు. దాంతో ఆ ఆలోచన విరమించుకున్నాను. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌తో మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేశా. కానీ కమల్‌ హాసన్‌ బిజీగా ఉండడంతో కుదరలేదు.

  • ఇప్పుడు సినిమాల్లో టెక్నాలజీ బాగా ఎక్కువైంది. దాంతో అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ నా దృష్టిలో ఏఐ కన్నా మనిషి ఆలోచనలే శక్తిమంతమైనవి. ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏఐ కన్నా మనిషి ఆలోచనలే ముందుంటాయి.

  • తప్పకుండా షారూఖ్‌ఖాన్‌తో సినిమా చేస్తాను. మంచి స్ర్కిప్ట్‌ కుదరాలి. అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌ లాంటి దర్శకులు సృజనాత్మకంగా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ‘ట్వల్త్‌ ఫెయిల్‌’ చిత్రం నాకు బాగా నచ్చింది.


అపరిచితుడు రీమేక్‌ను పక్కనపెట్టాం

రణ్‌వీర్‌సింగ్‌తో హిందీలో ‘అపరిచితుడు’ రీమేక్‌ చిత్రం లేనట్టే. ప్రస్తుతానికి ఆ చిత్రాన్ని పక్కనపెట్టినట్లు బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్‌ చెప్పారు. ఆ చిత్ర నిర్మాత జయంతిలాల్‌ గడ నాతో ‘అపరిచితుడు’ రీమేక్‌ కన్నా మరింత భారీ చిత్రం తీయాలనుకోవడమే దానికి కారణమని శంకర్‌ తెలిపారు. ‘ఈ రీమేక్‌ను ప్రకటించాక కొత్త కాన్సెప్ట్‌లతో పలు పాన్‌ ఇండియా చిత్రాలు వ చ్చాయి, మంచి విజయాన్ని అందుకొన్నాయి. దాంతో మా నిర్మాత మనసు మార్చుకున్నారు. ప్రస్తుతానికైతే ‘అపరిచితుడు’ రీమేక్‌ను పక్కనపెట్టినట్లే. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని శంకర్‌ చెప్పారు.

Updated Date - Jul 03 , 2024 | 05:03 PM