40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం!

ABN, Publish Date - Jan 25 , 2024 | 11:21 PM

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణత్రంత దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. చిరంజీవిని పద్మ విభూషణ్‌ పురస్కారం వరించింది.

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవిని (megastar chiranjeevi) మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణత్రంత దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. చిరంజీవిని పద్మ విభూషణ్‌ (Padma Vibhushan) పురస్కారం వరించింది. సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలకుగానూ 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ భూషణ్‌ పుర్కస్కారం అందజేసింది. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో సినీ కార్మికులతోపాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గురించిన భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్‌ పురస్కారంతో సత్కరించనుంది. గురువారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పద్మ అవార్డులను ప్రకటించారు.

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, సినిమాల మీదున్న ఆసక్తితో ఎలాంటి నేపథ్యం, ఎవరి సహకారం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నారు చిరంజీవి. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో ఆయన ఈ స్థాయిలో ఉండటానికి కారణం.. కృషి, పట్టుదల, తపన అని చెబుతుంటారు చిరంజీవి. 1978ల ప్రాంతమది. వెండితెరపై వెలుగుతున్న ఎందరో హేమాహేమీలున్నారు. శివశంకర వరప్రసాద్‌ అనే వ్యక్తి ఏ నేపథ్యం లేకుండా కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నటనపై ఎంతో ఆసక్తితో ఇండస్ర్టీలోకి వచ్చారు కాబట్టి తెరపై వెలుగొందుతున్న అప్పటి అగ్రతారలను చూసి వెనకడుగు వేయలేదు. అదే రంగంలో రాణిస్తాననే బలమైన నమ్మకంతో ముందడుగు వేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ‘పునాది రాళ్లు’ సినిమాలో నటించారు. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ముందుగా విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించమని కొందరు డిమాండ్‌ చేసేవారట. చెయ్యను అని చెబితే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనన్న భయం, మనల్ని మనం నిరూపించుకునే సమయం ఎప్పటికేౖనా వస్తుందనే ఆశతోనే వాటిలో నటించినట్లు చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పారు. తను అనుకున్న గమ్యాన్ని చేరుకుని ఎందరికో ఇన్స్‌పిరేషన్‌గా నిలిచారు. అవరోదాలు, అవమానాలు ఎదురైనా తన లక్ష్యాన్ని వీడకుండా ముందుకెళ్లారు.

ఆ అవమానంతోనే...

చిత్ర పరిశ్రమలోకి వెళ్లకుముందు చిరంజీవి హరిప్రసాద్‌, సుధాకర్‌ మద్రాసులో ఒకే గదిలో ఉండేవారు. ‘పూర్ణా పిక్చర్స్‌’ సంస్థ మేనేజరు తాము పంపిణీ చేేస సినిమాల ప్రివ్యూలు చూసి, వాటి రివ్యూలు ఇవ్వమని వారికి చెప్పేవారు. అలా ఓ హోదాలో ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చొన్నారు. ఇంతలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవర్‌, మేకప్‌మ్యాన్‌లు రావడంతో చిరంజీవి బృందాన్ని లేపి, వారిని కూర్చోబెట్టారట. చేేసదేమీలేక చిరు, తన స్నేహితులు నిల్చొనే సినిమాని చూశారు. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత భార్య అడగ్గా.. ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్‌ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేేస్త మీకు చెడ్డపేరు వస్తుందని ఓపిక పట్టాం. చూడండి ఆంటీ.. ఈ ఇండస్ర్టీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని ఆవేశంతో అన్నారట. చివరకు ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పుకొచ్చారు.

మాట పట్టింపుతో...

కెరీర్‌ బిగినింగ్‌ నుంచే చిరంజీవి డాన్స్‌లో నంబర్‌వన్‌. డ్యాన్స్‌ అంటే చిరు అని చాలామంది అంటుంటారు. ఆయన అంత గొప్ప డ్యాన్సర్‌గా మారడం వెనుక ఆసక్తికర కథ ఉంది. తొలినాళ్లలో.. చిరంజీవి ఓ సినిమాలోని పాట పూర్తి చేసుకుని బయటకు వచ్చి.. వెంకన్న అనే మేనేజరును కలుసుకున్నారు. ‘ఎలా ఉంది? నా పెర్ఫామెన్స్‌’ అని అడగ్గా.. ‘ఆ.. అందులో ఏముంది? నీ వెనుక డ్యాన్సర్లు ఏం చేశారో, అదే నువ్వు చేశావ్‌. నీ ప్రత్యేకత చూపించాలి కదా?’ అని ఆ మేనేజరు ముక్కుసూటిగా చెప్పాడట. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పినదానికి అదనంగా డ్యాన్స్‌ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు చిరంజీవి. నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్‌ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. పలు విమర్శల ద్వారా ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటే విజయం వరిస్తుందచి చిరంజీవి గ్రహించారు.

‘ఖైదీ’కి ముందు.. తర్వాత

చిరంజీవి కెరీర్‌ని ‘ఖైదీ’కి ముందు.. తర్వాత అని చెబుతుంటారు. 1983లో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిరంజీవికి మాస్‌ ఇమేజ్‌, స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. తనదైన శైలి డ్యాన్స్‌, డైలాగ్స్‌తో అలరించే ఆయన పాలిటిక్స్‌లోకి వెళ్లి నటనకు దూరమవడం అభిమానులు, ఆడియన్స్‌ను కాస్త బాధపెట్టింది. ‘ఖైదీ నం. 150’తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రేక్షకుల్లో మళ్లీ అదే హుషారు తీసుకొచ్చారు. వరుస సినిమాలు చేస్తూ యువ కథానాయకులకు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఒక హీరో.. రెండు బిరుదులు..

ఒకే హీరోకి రెండు బిరుదులు ఉండటం అరుదు. తొలినాళ్లలో ‘సుప్రీమ్‌ హీరో’గా పేరొందిన చిరు ఆ తర్వాత ‘మెగాస్టార్‌’గా విశేషమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు. 1988లో వచ్చిన ‘మరణ మృదంగం’తో చిరంజీవి.. మెగాస్టార్‌గా మారారు. ఆ చిత్ర నిర్మాత కె.ఎస్‌. రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. అంతకు ముందు వరకు ఆయన నటించిన సినిమా టైటిల్స్‌లో కొన్నింటిలో చిరంజీవి అని, మరికొన్ని చిత్రాల్లో ‘సుప్రీమ్‌ హీరో’ అని కనిపిస్తుండేది. చిరు ‘సుప్రీమ్‌ హీరో’గా కనిపించిన చివరి చిత్రం ‘ఖైదీ నంబరు. 786’.

సున్నిత మనస్కుడు...

చిరంజీవి సున్నిత మనస్కుడు. ఆయన ఒకరిని మాట అనడం, మాటలు దొర్లడం జరగదు. విమర్శించి, తిట్టినవారిని సైతం క్షమించే మనసు ఆయనది. తనని తక్కువ చేసి మాట్లాడినవారిని సైతం మిత్రులుగా చూస్తూ, ఆప్యాయంగా పలకరిస్తారు. వేదికలపై మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతుంటారు.

రాజకీయ ప్రస్థానం...

2008లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. పార్టీ ప్రారంభించిన తొమ్మిది నెలల్లో జరిగిన ఎన్నికల్లో 70 లక్షల ఓట్లను, 18 ఎంఎల్‌ఎ సీట్లను గెలుపొందారు. 2011లో పీఆర్‌పీను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయ్యారు. తదుపరి కేంద్ర టూరిజం శాఖ మాత్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

సేవల్లో ముందు...

సేవా గుణంలోనూ చిరంజీవి ముందుంటారు. మదర్‌ థెరిస్సా స్ఫూర్తితో 1998లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించి రక్త, నేత్ర దాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్‌ ద్వారా ఇప్పటికీ 68000 మందికి రక్తదానం చేశారు. 14 వందల మందికిపైగా చూపులేనివారికి చూపినిచ్చింది. అంతే కాదు సీసీటీ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా కష్టకాలంలో నిరాశ్రయులైన 15000 మందికి పైగా తెలుగు ఇండస్ట్రీ కార్మికులకు మూడు దఫాలుగా నిత్యావసర వస్తువులను ఇంటింటికి పంపించి ఆదుకున్నారు. సినీ కార్మికులకు ఉచిత కరోనా టెస్ట్‌లు, క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కార్యక్రమాలను నిర్వహించారు. కరోనా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానుల సహకారంతో ఉచిత ఆక్సిజన్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. అలాగే ఉచిత ఆరోగ్య పరీక్షలు ఇప్పటికీ నిర్వహించారు. కష్టం అని తన తలుపు తట్టిన ప్రతి ఒక్కరికీలో లక్షల్లో సహకారం అందిస్తుంటారు చిరంజీవి. అయితే ఇవేమీ ఆయన బయటకు చెప్పుకోరు.

అందుకున్న పురస్కారాలు...

స్వయంకృషి, అపద్భాందవుడు, ఇంద్ర చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు.

1988లో రుద్రవీణ చిత్రానికి నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ విభాగంలో నర్గీస్‌దత్‌ పురస్కారం వరించింది.

పున్నమినాగు, శుభలేఖ, రుద్రవీణ, ముఠామేస్త్రీ, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ చిత్రాలకు గానూ 8 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు.

2007లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్నారు చిరు. అదే ఏడాది ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. వంశీ ఆర్ట్స్‌ అకాడమీ నుంచి ఎన్టీఆర్‌ లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు వరించింది.

2022లో జరిగిన 53వ గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో (ఇఫి) అనురాగ్‌ ఠాకూర్‌ చేతుల మీదుగా ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఈయర్‌’ పురస్కారాన్ని అందుకున్నారు.

45 ఏళ్ల ప్రస్థానంలో చిరు సాధించిన పలు ఘనతలు..

ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’ వేడుక (1987)లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు.

1999– 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా చిరంజీవి ‘సమ్మాన్‌’ అనే అవార్డు పొందారు.

2002లో.. అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చిరుకి ఈ అవార్డుని అందించారు.

‘పసివాడి ప్రాణం’ సినిమాతో బ్రేక్‌ డ్యాన్స్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఏక పాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 100 రోజులు ప్రదర్శితమైన రికార్డు ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ర్టీలో చిరంజీవికే దక్కింది.

అత్యధిక పారితోషికం (రూ.కోటికిపైగా) అందుకున్న తొలి భారతీయ నటుచి?గా 1992లో వార్తల్లో నిలిచారు.

చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’.. రూ. 10 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన తొలి తెలుగు చిత్రంగా, ‘ఇంద్ర’..రూ. 30 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు చేసిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించాయి.

రష్యన్‌లోకి డబ్‌ అయిన తొలి తెలుగు చిత్రం.. చిరంజీవి నటించిన ‘స్వయంకృషి’.

1980, 1983.. ఈ ఏడాదుల్లో చిరంజీవి నటించిన 14 చిత్రాలు విడుదలయ్యాయి.

ప్రస్తుతం ఆయన విభిన్న కథా చిత్రాలతో యువ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నారు.

Updated Date - Jan 26 , 2024 | 09:50 AM