చిత్రపురి కాలనీలో అనర్హుల రిజిస్ట్రేషన్లు రద్దు

ABN, Publish Date - Nov 12 , 2024 | 06:24 AM

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుగు సినీ పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్రపురి కాలనీలో డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పేరు మీద...

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుగు సినీ పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్రపురి కాలనీలో డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పేరు మీద జూనియర్‌ ఆర్టిస్టుల కోసం, క్యారెక్టర్‌ ఆర్టిస్టుల కోసం స్థలాలు కేటాయించిందని గుర్తు చేశారు. ఇందులో అనర్హులుంటే వారి రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ఆ స్థలాలను తెలంగాణ ఆర్టిస్టులకు ఇవ్వాలనేది తన ఉద్దేశం అని అన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించిన తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘‘వారానికి నలుగురు, ఐదుగురు నిర్మాతలు వారి సినిమాల పోస్టర్‌ లాంచ్‌ చేయాలని కోరుతూ తన వద్దకు వస్తుంటారని, వారిని తాను అడిగితే థియేటర్లు దొరకడం లేదని అంటున్నారని అన్నారు. అలాంటి వాళ్లు రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌కి ముందే తనను సంప్రదిస్తే, మీకు సపోర్ట్‌గా ఉండి థియేటర్లు ఇప్పిస్తానని హామి ఇచ్చినట్లు మంత్రి చెప్పారు.


ఒక పాన్‌ ఇండియా సినిమా అంటూ ఐదారుగురు హీరోలకో, డైరెక్టర్లకో పరిమితమైతే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. పాన్‌ ఇండియా సినిమా రిలీజ్‌ అవుతోంది, పెద్ద బడ్జెట్‌తో తీశాం, మాకు రెట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని కొందరు తన వద్దకు వస్తున్నారని, అలాంటి వారికి సమయం ఇవ్వనని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో టాలెంట్‌ కలిగిన నటులు ఎందరో ఉన్నారని, వారికి తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతిభ కలిగిన తెలంగాణ నటీనటులకు గుర్తింపు దక్కడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎ్‌ఫసీసీ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ గురురాజ్‌, సెక్రటరీలు జేవీర్‌, కాచం సత్యనారాయణ, టీ మా ప్రెసిడెంట్‌ రశ్మీ ఠాకూర్‌, ప్రసాద్‌ సంస్థల అధినేత రమేశ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 06:24 AM