ఇతర భాషా చిత్రాలను తొక్కేస్తున్న బాలీవుడ్
ABN, Publish Date - Nov 04 , 2024 | 05:38 AM
ఉత్తరాదిన హిందీ చిత్రాలు మాత్రమే రాజ్యమేలుతున్నాయని, బాలీవుడ్‌లో కేవలం హిందీ చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇతర భాషాలైన మరాఠీ, బిహారీ, భోజ్‌పురి, హర్యానా, గుజరాత్ తదితర ఉత్తరాది సినిమాలను...
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
ఉత్తరాదిన హిందీ చిత్రాలు మాత్రమే రాజ్యమేలుతున్నాయని, బాలీవుడ్‌లో కేవలం హిందీ చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇతర భాషాలైన మరాఠీ, బిహారీ, భోజ్‌పురి, హర్యానా, గుజరాత్ తదితర ఉత్తరాది సినిమాలను తొక్కేస్తున్నారని తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంతంగా చిత్రపరిశ్రమలే లేవని, బాలీవుడ్ అంటే ఒక్క హిందీ చిత్రాలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. కానీ, దక్షిణాదిలో తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళ భాషల చిత్రపరిశ్రమలు పోటీపడుతూ వృద్ధి చెందుతున్నాయన్నారు. కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో ఓ మలయాళ పత్రిక ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో తమిళ చిత్రపరిశ్రమతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలు కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నాయన్నారు.
కానీ, దక్షిణాది తరహాలో ఉత్తర భారతదేశంలో హిందీ కాకుండా మరే ఇతర భాష అయినా శక్తిమంతమైన చిత్రపరిశ్రమను కలిగివుందా? అని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మాట్లాడే దాదాపు అన్ని భాషలు హిందీకి దూరమయ్యాయి అని చెప్పారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)