Indian 2: 'భారతీయుడు 2' సినిమా విడుదలకి మరో అడ్డు

ABN, Publish Date - Jul 10 , 2024 | 04:35 PM

శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'భారతీయుడు 2' సినిమా విడుదల థియేటర్స్ లో, ఓటిటి లో విడుదల కాకుండా ఆపు చెయ్యాలని మధురై కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఇంతకీ ఎవరు వేశారు ఈ పిటిషన్, ఎందుకు వేశారు, 'భారతీయుడు 2' విడుదల సజావుగా సాగుతుందా...

Kamal Haasan as Senapthi in Bharateeyudu 2

దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన 'భారతీయుడు' చాలా పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. అదెప్పుడో 28 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా. అందులో కమల్ హాసన్ రెండు విభిన్న పాత్రల్లో కనపడతారు, అందులో ఒకటి సేనాపతి పాత్ర. ఇప్పుడు ఆ 'భారతీయుడు' కి సీక్వల్ గా వస్తున్న 'భారతీయుడు 2' ఈ శుక్రవారం విడుదల చెయ్యడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. చిత్ర సభ్యులు కూడా ఈ సినిమా గురించి ముంబై, హైదరాబాదు, చెన్నై, కేరళ ఇలా తిరుగుతూ ప్రచారాలు చేస్తున్నారు.

ఈ సినిమా మొదలెట్టడం కూడా నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగింది, కానీ వివిధ కారణాలతో చిత్రీకరణ సరిగ్గా చేసుకోక ఆగిపోయింది. ముందుగా నిర్మాతలు మారారు, ఆ తరువాత కోవిడ్ రావటం, తరువాత చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరగటం ఇలా ఈ సినిమా నిజంగానే సినిమా కష్టాలు పడి చివరికి విడుదల ఈ శుక్రవారం అవుతున్న సమయానికి, ఇంకొక అవాంతరం ఎదురయ్యింది.

ఈ సినిమాలో మర్మకళ అని ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ని సేనాపతి పాత్ర వేసిన కమల్ హాసన్ వాడతారు. ఆ మర్మకళ టెక్నిక్ ని కేరళకి చెందిన రాజేంద్రన్ అనే అతను రాసిన పుస్తకం చదివి స్ఫూర్తి పొందారు శంకర్. అలాగే కమల్ హాసన్ కి రాజేంద్రన్ దగ్గరకి తీసుకెళ్లి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు శంకర్. ఇప్పుడు ఆ రాజేంద్రన్ ఈ 'భారతీయుడు 2' సినిమాపై మధురై కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ సినిమాని థియేటర్స్, ఓటిటి లో ఎక్కడా విడుదల కాకుండా నిషేధించాలని అతను తన పిటిషన్ లో పేర్కొన్నారు.

'భారతీయుడు' సినిమాలో ఈ మర్మకళ టెక్నిక్ ని తనకి చెప్పి చేశారని, ఇప్పుడు ఈ 'భారతీయుడు 2' లో తన అనుమతి తీసుకోకుండా ఆ కళని ఉపయోగించారని రాజేంద్రన్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకని ఈ సినిమా విడుదల ఆపుచేయాలని కోరారు. మధురై కోర్టు దానిపై స్పందించాలని చిత్ర యూనిట్ కి సమయం ఇస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. చిత్ర సభ్యుల స్పందన చూసి గురువారం కోర్టు ఏమని తీర్పు చెపుతుందో అని అందరూ ఉత్కంఠతో వున్నారు. ఈ సినిమాకి మొదటి నుండీ కష్టాలే, ఇప్పుడు విడుదల సమయంలో ఇదొక అడ్డు వచ్చింది.

Updated Date - Jul 10 , 2024 | 04:36 PM