Benguluru Rave Party: బెంగుళూరు పోలీసుల అదుపులో నటి హేమ, రేపు కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం
ABN, Publish Date - Jun 03 , 2024 | 04:23 PM
బెంగళూరు రేవ్ పార్టీ లో పాజిటివ్ వచ్చిన నటి హేమ ఇప్పుడు బెంగుళూరు పోలీసుల అదుపులో వున్నట్టుగా తెలుస్తోంది. ఆమెని అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు, రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
కొన్నిరోజుల క్రితం బెంగుళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీపై బెంగుళూరు పోలీసులు ఆకస్మిక దాడి చేసి కొంతమంది సెలబ్రటీలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీలో సినిమా పరిశ్రమకి చెందిన నటీనటులు కూడా ఉండటం ఆసక్తికరం. తెలుగు సినిమా నటి హేమ కూడా ఆ పార్టీలో పాల్గొన్న సంగతి కూడా విదితమే. అయితే తాను ఆ పార్టీలో లేనట్టుగా హేమ కొన్ని వీడియోలు పోస్టు చేసి అభాసుపాలైన సంగతి కూడా తెలిసిందే.
బెంగుళూరు పోలీసులు తరువాత హేమ పేరును అధికారికంగా ప్రకటించి ఆమె ఆ పార్టీలో వున్నట్టుగా చెప్పారు. అలాగే ఆమె రక్త నమూనాలని కూడా సేకరించి లాబ్స్ కి టెస్టులకు పంపితే ఆమె మాదకద్రవ్యాలు తీసుకున్నట్టుగా ఆ టెస్టుల్లో తేలిన విషయం కూడా బెంగుళూరు పోలీసులు చెప్పారు.
తరువాత హేమ కి బెంగుళూరు పోలీసులు నోటీసు జారీ చేసినా తనకి జ్వరంగా ఉందని రాలేను అని మొదట చెప్పినా, తరువాత బెంగుళూరు పోలీసులు జూన్ 1 న రమ్మని మళ్ళీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలిసింది. అయితే జూన్ 1 న కూడా ఆమె రాకపోవటంతో, బెంగుళూరు పోలీసులు హేమని విచారించి, ఆమెని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హేమను అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు, రేపు అక్కడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. గత నెల 20న బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ. తరువాత ఆమెకి ఈ డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.