Nandamuri Balakrishna: నటుడిగా బాలయ్య అరుదైన రికార్డు, చిత్ర పరిశ్రమ ఘన సన్మానం

ABN, Publish Date - Jul 11 , 2024 | 01:20 PM

నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక అరుదైన రికార్డు సాధించారు. అంతే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం తరలివచ్చి బాలకృష్ణ కి ఈ సందర్భంగా సెప్టెంబర్ 1 న ఘన సన్మానం చెయ్యాలని నిర్ణయించింది

Nandamuri Balakrishna

నటుడు నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇటు సినిమాలో గానీ, అటు రాజకీయాల్లో గానీ తనదైన ప్రత్యేక శైలి చూపిస్తూ వుంటారు. హిందూపూర్ నియోజకవర్గం నుండి మూడో సారి ఎన్నికయి తనకు రాజకీయాల్లో తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. ఒక పక్క హిందూపూర్ అభివృద్ధి పనులు చూసుకుంటూనే, ఇంకో పక్క సినిమాలకి కూడా తగిన సమయం కేటాయిస్తున్నారు. ఇలా బాలకృష్ణ నిరంతరం పని చేస్తూనే అటు పార్టీ సభ్యులకి, ఇటు తన అభిమానులకి ఆదర్శంగా వున్నారు. (Balakrishna is completing 50 years as an actor in this coming August)

ఈ ఆగస్టు 30 వస్తే బాలకృష్ణ 50 సంవత్సరాలు నటుడిగా పూర్తి చేసుకుంటున్నారు. బాలకృష్ణ నటించిన మొదటి సినిమా 'తాతమ్మ కల' 1974, ఆగస్టు 30న విడుదలైంది. తన తండ్రి దివంగత లెజండరీ నటుడు నందమూరి తారక రామారావు ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా, ఇందులో ప్రధాన పాత్రలో కనపడతారు. ఇదే సినిమాలో నందమూరి హరికృష్ణ కూడా నటించారు. ఈ సినిమా విడుదలై ఆగస్టు 30కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అదే సమయంలో బాలకృష్ణ కూడా నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. భానుమతి రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. (Balakrishna's debut film Tatamma Kala released on August 30, 1974, 50 years back)

అయితే బాలయ్య ఆ సినిమా నుండి ఇప్పటివరకు ఒక అరుదైన రికార్డు సాధించారు అనే చెప్పాలి. "బాలకృష్ణ కథానాయకుడిగా అరంగేట్రం చేసినప్పటినుంచి ఈ 50 సంవత్సరాలు కథానాయకుడిగానే సినిమాలు చేశారు. ఇది వేరే నటుడు ఎవరికీ సాధ్యం కాలేదు, ఒక్క బాలకృష్ణకు మాత్రమే ఇది సాధ్యం అయింది, ఇది అరుదైన రికార్డు," అని చెప్పారు, ప్రముఖ నిర్మాత టి ప్రసన్న కుమార్. అదీ కాకుండా బాలకృష్ణ తన మొదటి సినిమా నుండీ ఇప్పటివరకు ఎక్కడా విరామం లేకుండా నటిస్తూనే వున్నారని, అది కూడా ఇంకొక రికార్డు అని చెప్పారు. (Balakrishna made his debut with Tatamma Kala which is directed by his father late N T Rama Rao)

చాలామంది నటులు కొంతకాలం విరామం తీసుకోవటం, లేదా క్యారెక్టర్ నటుడిగా, నెగటివ్ క్యారెక్టర్ లో కనపడటం, తరువాత కథానాయకుడిగా స్థిరపడటం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ బాలకృష్ణ మాత్రం, కథానాయకుడిగానే ఈ 50 ఏళ్ళు నటించారు, ఇంకా నటిస్తున్నారు కూడా. ఇది ఒక అరుదైన రికార్డుగా చెప్పొచ్చు.

ఇప్పుడు బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాలకృష్ణకి ఘన సన్మానం చేసి సత్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. బాలకృష్ణని పరిశ్రమకి చెందిన కొంతమంది పెద్దలు వెళ్లి కలిసి ఈ విషయం చెప్పినట్టుగా, బాలకృష్ణ అందుకు వొప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన బాలకృష్ణని సన్మానించుకోవటం పరిశ్రమ తరుపున ఒక మంచి అవకాశం అని కూడా అంటున్నారు. సెప్టెంబర్ 1 వ తేదీన ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుందని తెలుస్తోంది. ఈ సన్మాన కార్యక్రమానికి చిత్ర పరిశ్రమ నుండి ఎంతోమంది, అలాగే అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో, ఈ వేడుక జరగబోయే ప్రదేశం కూడా పెద్దగా ఉండేట్టు తీసుకోవాలని కార్య నిర్వాహకులు అనుకుంటున్నారు. (Balakrishna made his debut with Tatamma Kala that is released on August 30, 1974)

ప్రస్తుతం బాలకృష్ణ, బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చేస్తున్న సినిమా చిత్రీకరణ దశలో వుంది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ చాలా సినిమాలు చేయాల్సి వుంది. అందులో బోయపాటి శ్రీనుతో చెయ్యబోయే 'అఖండ 2' ఒకటి. వాళ్ళిద్దరి కలయికలో ఇంతకు ముందు వచ్చిన 'అఖండ' సినిమాకి సీక్వల్ గా వస్తోంది ఇది.

-- సురేష్ కవిరాయని

Updated Date - Jul 11 , 2024 | 01:20 PM