ఆ విషయంలో అమితాబ్ తర్వాత బాలకృష్ణే!
ABN, Publish Date - Aug 08 , 2024 | 04:37 AM
‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 108 వ చిత్రం నిర్మాణంలో ఉంది. ఒక హీరోగా యాభై ఏళ్ల సినీ ప్రయాణం...
‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 108 వ చిత్రం నిర్మాణంలో ఉంది. ఒక హీరోగా యాభై ఏళ్ల సినీ ప్రయాణం నిజంగా అరుదైన విషయమే. అందుకే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకులను సెప్టెంబర్ ఒకటిన తెలుగు చిత్ర పరిశ్రమ భారీ స్థాయిలో నిర్వహించనుంది. బుధవారం జరిగిన ఈ వేడుక సన్నాహక కార్యక్రమంలో నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ ‘మా తమ్ముడు నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. నాన్నగారికి వారసుడిగా పరిశ్రమలో నిలబడడమే కాకుండా ఎటువంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు’ అన్నారు.
‘ఇండియన్ సినిమా హిస్టరీలో అమితాబ్ బచ్చన్ తర్వాత సుదీర్ఘకాలం నటుడిగా ఉంటూ బాలకృష్ణ తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. పరిశ్రమ అంతా కలసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’ అని కోరారు తమ్మారెడ్డి భరద్వాజ. నిర్మాతలమండలి కార్యదర్శి తుమ్మల స్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘ఈ వేడుక నిర్వహించడానికి మొదట బాలకృష్ణ ఒప్పుకోలేదు. కానీ ఇదొక స్పూర్తిదాయక కార్యక్రమంగా ఉంటుందని వివరించడంతో ఆయన అంగీకరించారు’ అన్నారు.