Anupama Parameswaran: ఈమె బనీను, డ్రాయరు రెండూ లాగేసేటట్టు వుంది: సిద్ధు
ABN, Publish Date - Mar 19 , 2024 | 12:01 PM
నేను అందంగా కనపడుతున్నాను కదా, అది మంచిదే కదా అంటూ తాను 'టిల్లు స్క్వేర్' లో చేసిన పాత్రను సమర్ధించుకున్నారు అనుపమ పరమేశ్వరన్. ఆ పాత్ర గురించి అడిగిన అనేక ప్రశ్నలకి తనదైన రీతిలో సమందానాలు చెప్పడం చూసి, పక్కనే వున్న సిద్ధు ఆమె బాగా ప్రిపేర్ అయి వచ్చినట్టుంది అని చెప్పారు
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాలోంచి ఒక పాటను నిన్న విడుదల చేశారు. 'ఓ మై లిల్లి' అనే పాటను ఈ సినిమా ప్రచారాల్లో భాగంగా విడుదల చేశారు. మొదటిసారిగా ఈ సినిమా ప్రచారానికి అనుపమ పరమేశ్వరన్ హాజరయ్యారు. అభిమానులు ఆమెని చూసి చాలా ఉత్సాహం ప్రదర్శించారు.
అనుపమకి ఈ సినిమా ట్రైలర్, కొన్ని పాటలు విడుదలయ్యాక బాగా పాపులారిటీ కూడా పెరిగింది. నిన్న జరిగిన ఈ వేడుకలో అనుపమ పేరు వినగానే చాలు, అభిమానులు అరుపులు అందుకు నిదర్శనం. అనుపమ అచ్చ తెలుగమ్మాయిలా చీరలో ఈ వేడుకకు హాజరయ్యారు, తెలుగులో మాట్లాడేరు. ఇప్పుడున్న పరభాషా నటీమణుల్లో తెలుగు మాట్లాడుతూ, తన గొంతుకు తనే డబ్బింగ్ చెప్పుకునే నటీమణుల్లో అనుపమ ముందుంటారు అని చెప్పొచ్చు.
అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్ చూస్తే ఈ పాట కానివ్వండి, లేదా ఈ సినిమా గురించి ఇంతకు ముందు ఆమె పోస్ట్ చేసిన పాటలు కానివ్వండి, అలాగే ట్రైలర్, ఇవన్నీ చూసిన ఆమె అభిమానులు మాత్రం అనుపమని ఈ సినిమాలో ఇంత గ్లామర్ గా చూడటం తమకి హార్ట్ బ్రేక్ అయిందని కామెంట్స్ విపరీతంగా పెడుతున్నారు
అయితే అదే విషయాన్ని నిన్న చాలామంది అనుపమని ముద్దు సన్నివేశాల గురించి, ఆమె గ్లామరస్ గా కనిపించడం గురించి అడిగారు. ఆమె ఇంతవరకు చేసిన పాత్రలు వేరు, ఈ సినిమా ట్రైలర్ చూసాక ఆమె ఈ సినిమాలో చేసిన పాత్ర కొంచెం గ్లామరస్ గా ఉండటమే కాకుండా, ఒక ముద్దు సన్నివేశంలో కూడా నటించారు అని తెలుస్తోంది. సినిమాలో ఇంకా ఇలాంటివి చాలా వుంటాయని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాని యూత్ ని టార్గెట్ చేసిన సినిమాగా చెపుతున్నారు.
అయితే నిన్న అనుపమ తనని అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెపుతూ వచ్చారు. బయటకి వెళ్ళేటప్పుడు రోజూ ఒకేలాంటి అవుట్ ఫిట్స్ వేసుకొని వెళ్లడం ఇష్టం ఉండదు కదా, వెరైటీ వున్నవి, కొత్తవి కూడా వేసుకోవాలి అనుకుంటాం, అందుకనే ఒకే రకమైన పాత్రలు కాకుండా, కొత్తవి చెయ్యాలని అనుకున్నాను, అందుకే ఈ సినిమాలో ఇటువంటి పాత్ర చేసాను అని చెప్పింది.
అలాగే బిర్యానీ ఇష్టమని, రోజూ బిర్యానీ తినలేము కదా, ఒకసారి పులావ్, లేదా పులిహార ఇలా వేరేవి కూడా తినాలి కదా. ఇది కూడా అలాంటిదే, అన్నీ ఒకేలాంటి పాత్రలు కాకుండా, అప్పుడప్పుడూ కొత్తవి ప్రయత్నం చెయ్యాలని, అందుకే ఇది చేసానని తను చేసిన పాత్రని సమర్ధిచుకున్నారు. ఆమె ఒక్కో ప్రశ్నకి తనదైన రీతిలో సమాధానాలు చెపుతుంటే పక్కనే వున్నా సిద్ధు 'బాబోయ్ ఆమె బాగా ప్రిపేర్ అయి వచ్చినట్టుంది, ఈమె బనీను, డ్రాయరు రెండూ లాగేసేటట్టు వుంది' అని అన్నారు.
ఆమె సమాధానాలు చూసి సిద్ధు తాను కూడా అంతలా ప్రిపేర్ అవలేనని, అనుపమ బాగా ప్రిపేర్ అయి వచ్చినట్టుంది అన్న భావన వచ్చేటట్టు మాట్లాడేరు సిద్ధు. ఇందులో గ్లామర్ డోస్ కొంచెం పెరిగినట్టుంది అనే ప్రశ్నకి, 'నేను అందంగా ఉన్నానా లేనా, వున్నాను కదా, అదే కదా అందరికీ కావాల్సింది' అని చెప్పారు అనుపమ.