Pawan Kalyan victory: అల్లు కుటుంబ సభ్యులు ఎక్కడా కనిపించలేదేం..?
ABN, Publish Date - Jun 06 , 2024 | 06:33 PM
ఎంఎల్ఏ గా మొదటిసారి గెలిచిన పవన్ కళ్యాణ్, తన తల్లి, అన్నయ్య, వదినలు ఆశీర్వచనాలు తీసుకోవడానికి చిరంజీవి ఇంటికి ఈరోజు వెళ్లారు. అక్కడ మొత్తం కొణిదెల కుటుంబ సభ్యులు, చిరంజీవి సోదరులు, సోదరీమణులు, అందరూ వున్నారు. కానీ అక్కడ అల్లు కుటుంబ సభ్యులు మాత్రం మిస్ అయ్యారు. ఇదే విషయం ఇప్పుడు పరిశ్రమలో ఒక పెద్ద చర్చగా నడుస్తోంది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. తను గెలవటమే కాకుండా, తన పార్టీ నుండి నిలుచున్న అభ్యర్థులందరినీ గెలిపించారు. తన మిత్ర పక్షాల అభ్యర్థులను కూడా గెలిపించుకున్నారు. గెలిచిన తరువాత తీరిక లేకుండా అభిమానులతో, తరువాత ఢిల్లీ వెళ్లి అక్కడ కాబోయే ప్రధానమంత్రి మోదీతో, జాతీయ నాయకులతో ఎడతెరిపి సమావేశాలు నిర్వహించారు. ఇంత బిజీ సమయంలోనూ తన తల్లి, అన్నయ్య, వదినలు ఆశీర్వాదం తీసుకునేందుకు అన్నయ్య ఇంటికి వెళ్లారు. అదీ పవన్ కళ్యాణ్ అంటే. (Allu family members are completely missing at Pawan Kalyan victory celebrations held at Chiru house)
అయితే ఇక్కడ ఒక ఆసక్తికర అంశం వుంది. చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ కుటుంబంతో వెళ్లారు, తనయుడు అకిరా నందన్ ని కూడా తీసుకువెళ్లారు. చిరంజీవి ఇంట్లో కేవలం కొణిదెల కుటుంబ సభ్యులు మాత్రమే కనిపించారు. చిరంజీవి, అతని సోదరుడు నాగబాబు, చిరంజీవి సోదరీమణులు, వారి కుటుంబ సభ్యులు అందరూ వున్నారు. మరి ఇక్కడేంటి ఆసక్తికరం అనుకుంటున్నారా, అదే అల్లు కుటుంబం మొత్తం మిస్ అయింది కదా!
ఒక్కసారి గతంలోకి వెళితే, పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ ని కలవడానికి రామ్ చరణ్, అతని తల్లి సురేఖ పిఠాపురం బయలుదేరి వెళ్లారు. అదే రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో నంధ్యాల బయలుదేరి వెళ్లారు. ఎందుకంటే తన స్నేహితుడు శిల్ప రవికిశోర్ చంద్ర రెడ్డి పిలవకపోయినా, తను వెళ్లి అతనికి ఎన్నికల్లో గెలిపించడానికి అని చెప్పారు.
బాగుంది స్నేహితుడి కోసం అతను చెయ్యాల్సిన పనే చేశారు. కానీ వెళ్లిన టైమింగే సరైనది కాదు అని మెగా అభిమానాలు అంటున్నారు. ఎందుకంటే తన సమీప బంధువు పవన్ కళ్యాణ్ కి ముందుగా కలిసి, తన సంఘీభావం తెలిపి ఆ తరువాత నంధ్యాల స్నేహితుడి కోసం వెళితే బాగుండేది. కానీ అల్లు అర్జున్ ఆలా చెయ్యలేదు. అదీ కాకుండా, రామ్ చరణ్, అతని తల్లి సురేఖమ్మ పవన్ కళ్యాణ్ ని కలవటానికి వెళ్లిన రోజే అల్లు అర్జున్ వెళ్లడం. ఇవన్నీ పెద్ద వివాదాలకు తయారీ తీసింది అప్పుడు. అల్లు అర్జున్ ని ట్రోల్ చేశారు అప్పుడు, ఎన్నిక ఫలితాలు ప్రకటించిన తరువాత కూడా అర్జున్ ని ట్రోల్ చేశారు, ఎందుకంటే నంధ్యాలలో తన స్నేహితుడు ఘోరంగా ఓడిపోవటంతో.
ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వచ్చిన సందర్భంలో ఒక్క అల్లు కుటుంబ సభ్యుడు కూడా కనపడక పోవటం పరిశ్రమలో పెద్ద చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ మొహం చెల్లకే రాలేదని కొందరు అంటున్నారు, కొందరేమో ఏ మొహం పెట్టుకొని వెళతాడు అల్లు అర్జున్ అని అంటున్నారు. ఏమైనా కూడా కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య అల్లు అర్జున్ చేసిన తప్పిదం వలన దూరం పెరిగిందని పరిశ్రమలో పెద్దగానే చర్చ నడుస్తోంది. ముందు ముందు ఏమవుతుందో చూడాలి.