Allu Arjun: ఐకాన్ స్టార్ కి ఘోర పరాజయం !
ABN, Publish Date - Jun 04 , 2024 | 04:24 PM
తన స్నేహితుడు, వైస్సార్సీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయం కోసం నంద్యాల వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్యటన స్నేహితుడికి ఉపయోగం అయినట్టుగా కనపడటం లేదు. అదీ కాకుండా రెండో సారి మళ్ళీ తప్పు పునరావృతం కాకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి గెలిచారు అని ప్రకటన వెలువడిన కొన్ని నిముషాలకే పవన్ కళ్యాణ్ ని అభినందిస్తూ 'ఎక్స్' లో ఆలస్యం కాకుండా పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్
ఈసారి ఎన్నికల్లో చలన చిత్ర రంగానికి చెందిన చాలామంది నటీనటులు కొన్ని రాజకీయ పార్టీలకి ప్రచారం చేశారు. అయితే అందులో బాగా విమర్శలకి గురైంది మాత్రం అల్లు అర్జున్ అని చెప్పాలి. ఎందుకంటే తన సమీప బంధువు, నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం నుండి పోటీ చేస్తుండగా, అతనికి ప్రచారం నిర్వహించకుండా, తనకి స్నేహితుడైన నంద్యాల వైస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రచారానికి వెళ్లారు.
పైగా తన స్నేహితుడు తనని ఆహ్వానించలేదు, తనే కావాలని వెళ్ళాను అని చెపుతూ, తన స్నేహితుడు గెలవాలని అనుకుంటున్నాను అని చెప్పారు. అల్లు అర్జున్ పర్యటన అపుడు ఎంతో వివాదం అయింది. కనీసం ఎన్నికల సంఘానికి చెప్పలేదు, నంద్యాలలో ఎన్నికల అధికారులకి, పోలీసు వారికి కూడా కనీస సమాచారం లేకుండా అల్లు అర్జున్ వెళ్లారు. వెళ్ళటమే కాకుండా అక్కడ వందలాది మంది అభిమానులతో బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. (Icon Star Allu Arjun friend is trailing in Nandhyal Assembly constituency)
ఎంత అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అయితే మాత్రం, సమాచారం లేకుండా ఆలా ఎలా వెళతారు అని ఎన్నికల సంఘం అతని పర్యటనని చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే ఒక కేసు కూడా పెట్టింది. అల్లు అర్జున్ నంద్యాల వచ్చినప్పుడు బందోబస్తుకు వెళ్లిన కొంతమంది పోలీసులపై చర్యలు కూడా తీసుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రామ్ చరణ్, అతని తల్లి సురేఖతో పవన్ కళ్యాణ్ ని చూడటానికి పిఠాపురం వెళ్లిన రోజే అల్లు అర్జున్ కూడా తన నంధ్యాల పర్యటన జరపటం ఇంకా పెద్ద వివాదాస్పదంగా మారింది.
మెగా కుటుంబం నుండి కొంచెం వ్యతిరేకత వచ్చింది, మెగా అభిమానులు అల్లు అర్జున్ ని ట్రోల్ చేశారు కూడా. అదే సమయంలో అల్లు అర్జున్ చేసిన పనికి అతని తండ్రి అల్లు అరవింద్ కొంచెం బాలన్స్ చేయాలనుకున్నారు, అందుకే హడావిడిగా రామ్ చరణ్, సురేఖలతో కలిసి పిఠాపురం వెళ్లి, పవన్ కళ్యాణ్ ని పలకరించారు. (Icon Star Allu Arjun friend Shilpa Ravichandra Kishore Reddy is training in Nandhyal Assembly constituency)
అల్లు అర్జున్ పర్యటన తన స్నేహితుడికి ఎటువంటి ఉపయోగం అవలేదు అని తెలుస్తోంది. తాజా వార్తల ప్రకారం అల్లు అర్జున్ స్నేహితుడు శిల్ప రవిచంద్ర రెడ్డి ఓడిపోతున్నారని తెలిసింది. 18వ రౌండ్ అయ్యేసరికి అతనిపై తెలుగు దేశం అభ్యర్థి ఎన్ ఫరూక్ మెజార్టీలో వున్నారు, గెలుపు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలిసింది. అల్లు అర్జున్ నంధ్యాల పర్యటన కేవలం వివాదాలతో ముగిసింది, తన స్నేహితుడికి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని పరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ గెలిచారు అని ప్రకటన వెలువడగానే, ఈసారి అల్లు అర్జున్ ఎటువంటి ఆలస్యం చెయ్యకుండా తన సామాజిక మాధ్యమైన 'ఎక్స్' లో వెంటనే పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెపుతూ పోస్ట్ పెట్టారు. రెండో సారి అదే తప్పు మళ్ళీ చెయ్యకూడదు అందుకున్నారేమో! అందుకనే ఈసారి వెంటనే స్పందన వచ్చింది అని కూడా చర్చ నడుస్తోంది.