Actress Hema: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు సంచలన లేఖ రాసిన నటి హేమ
ABN, Publish Date - Jul 08 , 2024 | 11:29 AM
నటి హేమ ఈరోజు మూవీ ఆర్టిస్టు ఆసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుని కలిసి ఒక లేఖని ఇచ్చారు. అందులో తనని మా సభ్యత్వం నుండి తొలగించడం అన్యాయం అని చెప్పారు. షోకాజు నోటీసు ఇవ్వకుండా, తన వివరణ కోరకుండా సభ్యత్వం నుండి ఎలా తొలగిస్తారు అని అడిగారు. మళ్ళీ తన సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కోరారు.
తెలుగు నటి హేమ ఇంకా వార్తల్లో వున్నారు. బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో హేమ ఉండటం, మారక ద్రవ్యాలు సేవించింది అనే కారణంపై ఆమధ్య బెంగుళూరు పోలీసులు నటి హేమని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత హేమ బెయిల్ పై బయటకి వచ్చిన విషయం కూడా తెలిసిందే. బెంగుళూరు పోలీసులు హేమని అరెస్టు చేసిన తరువాత, ఆమెపై వచ్చిన ఆరోపణలు చూసి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) హేమని తమ సభ్యత్వం నుండి తొలగించారు.
అయితే ఇప్పుడు హేమ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కి ఒక సంచలన లేఖ రాసి, మా అధ్యక్షుడు మంచు విష్ణుకి స్వయంగా అందచేశారు. ఇందులో తనని మా సభ్యత్వం నుండి తొలగించడం అన్యాయం అని పేర్కొన్నారు. తనకి ఎటువంటి షోకాజ్ నోటీసు జారీ చెయ్యకుండా, తన వివరణ అడగకుండా తనని సభ్యత్వం నుండి తొలగించడం అన్యాయం అని పేర్కొన్నారు హేమ.
ఈ లేఖతో పాటు తన టెస్ట్ రిపోర్ట్ ను కూడా మంచు విష్ణుకు హేమ అందచేశారు. తాను పాల్గొన రేవ్ పార్టీ ఉదంతంలో తనపై దుష్ప్రచారం జరిగిందని ఈ లేఖలో హేమ పేర్కొన్నారు. తన వాదనలు వినకుండా 'మా' ఏకపక్షంగా వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది హేమ. ఇటీవలె తను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నట్టు, అందులో తనకు నెగిటివ్ వచ్చినట్లు ఈ లేఖలో హేమ పేర్కొంది. త్వరలోనే పోలీసులు జరిపిన పరీక్షల వివరాలు బయటకు వస్తాయి అని కూడా ఇందులో పేర్కొంది.
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఒత్తిడితో తన మా సభ్యత్వం తొలగించారు అని హేమ చెప్పారు. మా బైలాస్ ప్రకారం తనకి ముందుగా షోకాజ్ నోటీసు జారీ చెయ్యాలని, కానీ అటువంటిది జరగలేదని చెప్పింది హేమ. అందులో తన వివరణ తీసుకోలేదని, షోకాజ్ నోటీసుకు ఇచ్చిన వివరణ సరైనది కానప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని, కానీ షోకాజ్ నోటీసు ఇవ్వకుండా తనని తీసెయ్యడం తప్పని చెప్పింది హేమ. అందుకని మళ్ళీ తన సభ్యత్వాన్ని 'మా'లో కొనసాగించాలి అని చెప్పింది హేమ. ఎందుకంటే తనకి 'మా' సపోర్ట్ కావాలి అని చెప్పింది.
హేమ లేఖను తీసుకున్న మంచి విష్ణు ఈ లేఖని అడ్వైజరీ కమిటీకి పంపిస్తామని, తరువాత మా కమిటీ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని హెమ్కి హామీ ఇచ్చిన్నట్టు తెలిసింది.