నవరస నటనకు యాభై ఏళ్లు!
ABN, Publish Date - Aug 30 , 2024 | 05:57 AM
ఎన్టీఆర్ వంటి మహా నటుడికి వారసుడు కావడం ఒక విధంగా బాలకృష్ణ అదృష్టం, మరో రకంగా అగ్నిపరీక్ష కూడా. తండ్రి పేరు నిలబెట్టి ఆ విషయంలో విజయం సాధించారు బాలకృష్ణ. యాభై ఏళ్లక్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైన ‘తాతమ్మ కల’(1974 ఆగస్టు 30) చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.
ఎన్టీఆర్ వంటి మహా నటుడికి వారసుడు కావడం ఒక విధంగా బాలకృష్ణ అదృష్టం, మరో రకంగా అగ్నిపరీక్ష కూడా. తండ్రి పేరు నిలబెట్టి ఆ విషయంలో విజయం సాధించారు బాలకృష్ణ. యాభై ఏళ్లక్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైన ‘తాతమ్మ కల’(1974 ఆగస్టు 30) చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. సాధారణంగా 30 ఏళ్లో, నలభై ఏళ్ల కాలమో కథానాయకుడిగా నటించి, ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అయిన నటులు ఎందరో! కానీ బాలకృష్ణ విషయం చాలా ప్రత్యేకం. తొలి సినిమా ‘తాతమ్మ కల’ నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఏడాది కూడా గ్యాప్ తీసుకోకుండా హీరోగానే నటిస్తూ యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారు బాలకృష్ణ. సెప్టెంబర్ ఒకటిన దక్షిణాది చిత్రపరిశ్రమలోని అతిరథ మహారథుల సమక్షంలో ఆయనకు భారీ సన్మానం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కెరీర్‌లో మలుపులు, మెరుపులు....
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో నటీనటులు తమ వారసుల్ని వెండితెర కు పరిచయం చేశారు. ఆ సంప్రదాయాన్ని మన దేశంలో మహా నటుడు పృథ్విరాజ్ కపూర్ అనుసరించారు. ఆయన తనయులు రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్ తండ్రి లాగానే నటనను వృత్తిగా స్వీకరించి తమదైన బాణీ పలికించారు. రాజ్ కపూర్ కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకొని తన ముగ్గురు కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేశారు. దక్షిణాది మహా నటుడు నందమూరి తారకరామారావు ఈ విషయంలో రాజ్ కపూర్ ను అనుసరిస్తూ తొలిసారిగా తెలుగు నాట తన తనయులు హరికృష్ణ, బాలకృష్ణను నటనా రంగంలో అడుగు పెట్టేలా ప్రోత్సహించారు. అయితే నట వారసుల్లో ఎవరికీ లేనంత సుదీర్ఘమైన కెరీర్ బాలకృష్ణ సొంతం.
బాలకృష్ణ నటించిన తొలి చిత్రం ‘తాతమ్మ కల’కు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ విధానాన్ని దేశంలో తొలిసారిగా ప్రవేశ పెట్టినప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ నిర్మించిన సినిమా ఇది. యాభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న తర్వాత సినిమాను ఆపేసి, చిన్న చిన్న మార్పులతో మళ్లీ విడుదల చేశారు. రెండు సార్లు సెన్సార్ అయి, రెండు సార్లు విడుదల అయిన సినిమా తెలుగులో ఇదొక్కటే. ఇందులో బాలకృష్ణది బాలనటుడి పాత్ర కాదు. కథలో కీలకమైన పాత్ర.
ఎన్టీఆర్ అనితర సాధ్యంగా అభినయించిన శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలను బాలకృష్ణ సైతం పోషించి అభిమానుల్ని అలరించారు. అంతే కాదు ఎన్టీఆర్ పోషించని అభిమన్యు, నారద, ఆంజనేయ పాత్రలను బాలకృష్ణ పోషించి అభినందనలు అందుకున్నారు. పెద్దాయన పాతాళ భైరవి వంటి జానపద చిత్రాల్లో నటిస్తే, బాలయ్య భైరవ ద్వీపం సినిమాతో అభిమానులను ఆకట్టుకున్నారు.
ఒకే చిత్రంలో అటు భగవంతుడు, ఇటు భక్తునిగా నటించిన ఘనత తెలుగు నాట ఎన్టీఆర్, బాలకృష్ణ దే. 1964లో వచ్చిన శ్రీ సత్యనారాయణ మహత్మ్యం’ లో ఎన్టీఆర్ శ్రీ మహా విష్ణువుగా, సత్యవ్రతుడిగా నటించారు. అలాగే ‘పాండురంగడు’ లో బాలయ్య శ్రీకృష్ణ, పుండరీక పాత్రలతో మెప్పించారు.
బాలకృష్ణ ఎప్పుడూ ట్రెండ్‌ను ఫాలో కాలేదు. ఆయన నటిస్తేనే అది ట్రెండ్ అయింది. ఆ ట్రెండ్‌ను తర్వాత మిగిలిన హీరోలందరూ ఫాలో కావడం గమనార్హం. డిస్కో డ్యాన్సులు, మెషిన్‌గన్స్‌తో యాక్షన్ సినిమాలు వస్తున్న రోజుల్లో బాలకృష్ణ పంచె కట్టుతో, కర్ర సాముతో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించారు. ఆ తర్వాత చాలా కాలం తెలుగులో గ్రామీణ వాతావరణంలో సినిమాలు వచ్చాయి. అలాగే తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల నిర్మాణం బాగా పెరగడానికి బాలకృష్ణ నటించిన ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ చిత్రాల సంచలన విజయమే కారణం.
ఎన్టీఆర్ తన 52 వ ఏట బాపు దర్శకత్వంలో రూపొందిన శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రంలో శ్రీరామునిగా నటించారు. అలాగే బాలకృష్ణ కూడా తన 52 వ ఏటనే అదే బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం చిత్రంలో శ్రీరామునిగా నటించడం విశేషం.
తండ్రి పేరుతో తీసిన బయోపిక్ లో తనయుడు హీరోగా నటించిన సందర్భాలు గతంలో లేవు. అరుదైన ఆ ఘనత బాలయ్య కే దక్కింది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహనాయకుడు చిత్రాల్లో బాలయ్య ఎన్టీఆర్ గా కనిపించడంతో అభిమానులు మురిసిపోయారు.
రాజకీయ నాయకునిగా కూడా తండ్రి వారసత్వాన్ని కాపాడుతున్నారు బాలకృష్ణ. మూడు సార్లు హిందూపరం శాసససభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ ప్రజా సేవలోనూ తన ముద్రను చాటారు.