Shreya Ghoshal: శ్రేయా గోషాల్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా..
ABN, Publish Date - Oct 13 , 2024 | 10:10 AM
ఒకవైపు సినిమా పాటలతో బిజీగా ఉన్నా... మరోవైపు ప్రైవేటు గీతాలు కూడా పాడుతూ దేశవిదేశాల్లో శ్రేయా గోషాల్ ఇచ్చే లైవ్ షోలకు లెక్కే లేదు. మరి ఇలాంటి గొప్ప సింగర్‌కు స్ఫూర్తి ఎవరై ఉంటారు. ఆ విషయం ఏదో ఆమెనే అడిగితే పోలా. ఇదే ప్రశ్నకు ఆమె ఏం సమాధానం చెప్పిందంటే..
ఒకవైపు సినిమా పాటలతో బిజీగా ఉన్నా... మరోవైపు ప్రైవేటు గీతాలు కూడా పాడుతూ... తన గాత్రానికి మరింత వైవిధ్యాన్ని జోడించే ప్రయత్నం చేస్తోంది బెంగాలీ సింగర్ శ్రేయా గోషాల్. తన పాటలకు తనే సాహిత్యం రాసుకొని, వాటిని విడుదల చేస్తోంది. ‘న వో మై, అప్‌నీ మాతీ’ తదితర వాటిల్లో ఉన్నాయి. 73వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రూపొందించిన ‘అప్‌నీ మాతీ’ గీతాన్ని... సద్గురు జగ్గీవాసుదేవ్ ‘ఇషా ఫౌండేషన్’ తమ ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి ఉపయోగించుకుంది. పలువురు అంతర్జాతీయ కళాకారులతో కలిసి కొన్ని ఆల్బమ్స్ చేసింది. ఇక దేశవిదేశాల్లో ఆమె ఇచ్చే లైవ్ షోలకు లెక్కే లేదు. మరి అలాంటి శ్రేయా గోషాల్ (Shreya Ghoshal).. తనకు స్ఫూర్తి ఎవరో తాజాగా చెప్పుకొచ్చింది. అలాగే తన వ్యక్తిగత విషయాలను కూడా కొన్ని తెలియపరిచింది.
స్ఫూర్తి మంత్రం...
సంగీతంపై తనకు మక్కువ కలిగింది తన తల్లి శర్మిష్టను చూసే అంటారు శ్రేయ. శర్మిష్ట క్లబ్బుల్లో శాస్త్రీయ బెంగాలీ గీతాలు ఆలపించేవారు. ఆవిడే శ్రేయను అంత చిన్న వయసులో సంగీతం వైపు నడిపించారు. ‘నా తొలి గురువు మా అమ్మే. నా తొలి విమర్శకురాలు కూడా తనే. లతామంగేష్కర్‌ను, కేఎస్ చిత్రను గాత్రంలో నా గురువులుగా భావిస్తాను. నేను పాడే శైలిపై వాళ్ల ప్రభావం ఎంతో ఉంది. అలాగే వైవిధ్యంలో ఆశాభోంశ్లే, గీతా దత్తా, ఘజల్స్‌లో జగ్జీత్‌సింగ్ నాకు స్ఫూర్తి అంటున్నారు శ్రేయ.
Also Read- Nara Family Marriage: నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే?
వ్యక్తిగతం...
చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు భిన్నం శ్రేయ. తన వ్యక్తిగత జీవితం గురించి నలుగురితో పంచుకోవడానికి ఇష్టపడదు. శ్రేయ, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ కెమెరాలకు దూరంగా ఉంటారు. అయితే వీరి ప్రేమ కథ ఏ సినిమా కథకూ తీసిపోదు. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. పదేళ్ల సహజీవనం తరువాత 2015లో పెళ్లి చేసుకున్నారు. ‘ఒక స్నేహితుడి వివాహ వేడుకలో ముందుగా తనే నన్ను అడిగాడు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది శ్రేయ. తన భర్తే తన మనసుకు దగ్గరైనవాడని పేర్కొంది. 2015లో వీరు మగబిడ్డకు జన్మనిచ్చారు. ముంబయి యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన ముఖోపాధ్యాయ కాలర్ ఐడీ, కాల్ బ్లాకింగ్ యాప్ ‘ట్రూకాలర్’కు గ్లోబల్ హెడ్.