Vikrant Massey: విక్రాంత్.. ఎందుకీ నిర్ణయం.. నిరాశలో అభిమానులు
ABN, Publish Date - Dec 02 , 2024 | 10:06 AM
‘12th ఫెయిల్’ చిత్రంతో దేశంవ్యాప్తంగా గుర్తింపు పొందారు బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం అభిమానులతోపాటు సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘12th ఫెయిల్’ (12th Fail)చిత్రంతో దేశంవ్యాప్తంగా గుర్తింపు పొందారు బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే(Vikrant Massey). ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం అభిమానులతోపాటు సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను కొంత కాలం పాటు కొత్త సినిమాలు చేయలేనంటూ విరామం( Retirement Announces) ప్రకటించారు. దీనిపై ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ విడుదల చేశారు. ‘కొన్ని సంవత్సరాలుగా అందరి నుంచి అసాధారణమైన ప్రేమను, అభిమానాన్ని పొందుతున్నాను. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. కుటుంబసభ్యులకు నా పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన టైమ్ వచ్చింది. అందుకే సినిమాలను ఇక అంగీకరించడం లేదు. మళ్లీ సరైన సమయం వచ్చేంతవరకు.. 2025లో విడుదల కానున్న సినిమానే నా చివరి సినిమా. ఇటీవల నేను నటించిన చిత్రాలపై మీరు చూపిన ఆదరాభిమానాలు మర్చిపోలేను. ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇచ్చారు. అందరికీ కృతజ్ఞతలు’ అని నోట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రకటన అతడి అభిమానులు షాక్‌కు గురి చేసింది. అయితే ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు. మరోసారి ఆలోచించాలంటున్నారు. మరికొందరు మాత్రం ఏదైనా సినిమా ప్రచారంలో భాగంగా ఈ ప్రకటన చేశారా అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు.
విక్రాంత్ మాస్సే సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టారు. 'బాలికా వధూ' (చిన్నారి పెళ్లికూతురు)తో అందరికీ అభిమాన నటుడిగా మారారు. 2017లో ‘ఎ డెత్ ఇన్ ది గంజ్’తో వెండితెరపై హీరోగా కనిపించి అలరించారు. గతేడాది విడుదలైన ‘12th ఫెయిల్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నారు. ఇటీవల జరిగీన ‘ఇఫీ’ వేడుకల్లోనూ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకున్నారు.