Sujoy Ghosh: కారావాన్‌ పెట్టే డబ్బు లేక ఇబ్బంది పడ్డా..

ABN, Publish Date - Oct 06 , 2024 | 06:24 PM

తనని ఎవరూ నమ్మని సమయంలో అమితాబ్‌ అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు అంటూ దర్శకుడు సుజోయ్‌ ఘోష్‌ (Sujoy Ghosh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనని ఎవరూ నమ్మని సమయంలో అమితాబ్‌ అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు అంటూ దర్శకుడు సుజోయ్‌ ఘోష్‌ (Sujoy Ghosh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తనకు దేవుడితో సమానమన్నారు. నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) , రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తో ‘అలాదీన్‌’ తెరకెక్కించా. కథ వినగానే చేస్తానని అమితాబ్‌ హామీ ఇచ్చారు. ఆయన వెంటనే ఓకే చెప్పడానికి కారణం నాకు తెలియదు. ఎన్నో అంచనాల మధ్య 2009లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం అందుకుంది. 17 మంది ఆ సినిమా చూస్తే.. అందులో 15 మంది మా కుటుంబ సభ్యులే. ఆ సినిమా పరాజయం నన్నెంతో బాధించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో అమితాబ్‌ నాకు ధైర్యాన్ని ఇచ్చారు. నువ్వు ఏదైనా చెయ్‌.. నేను సపోర్ట్‌గా ఉంటానన్నారు.


ఆ తర్వాత కొన్నేళ్లు కష్టపడి ‘కహానీ’ కథ రాశా. ఆ కథతో ఎంతోమందిని సంప్రదించా. ఒక ప్రెగ్నెంట్‌ అలా ఎలా ఉంటుంది? ఇది వర్కౌట్‌ కాదు అని సలహాలిచ్చారు. కానీ, నేను వెనుకడుగు వేయలేదు. సొంత డబ్బుతో నిర్మించా. అమితాబ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అది మాకు ప్లస్‌ అయింది. ఒకవేళ దేవుడు బిజీగా ఉంటే సాయం చేయడానికి మరొకరిని పంపిస్తాడని అంటుంటారు కదా.. ఆ క్షణంలో అమితాబ్‌ను చూశాక అది నిజమే అనిపించింది. నాకు సాయం చేయడం కోసం ఆయన్ను పంపించినట్లు ఉన్నారు’’ అని సుజోయ్‌ చెప్పుకొచ్చారు. ‘అలాదీన్‌’ పరాజయంతో నిర్మాతగా ఎంతో నష్టపోయానని అన్నారు. దాని వల్ల ‘కహానీ’ సెట్‌లో కారవాన్‌లు ఏర్పాటు చేయడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడ్డానని చెప్పారు. తన పరిస్థితిని విద్యాబాలన్‌ అర్థం చేసుకున్నారని, కారులోనే ఆమె దుస్తులు మార్చుకునే వారని చెప్పారు. 

Updated Date - Oct 06 , 2024 | 07:11 PM