Sonakshi Sinha: అలాంటి సినిమాల జోలికి వెళ్లను
ABN, Publish Date - Jul 15 , 2024 | 10:55 AM
ఇటీవల తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో ఏడడుగులు నడిచింది బాలీవుడ్ తార సోనాక్షిసిన్హా. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు సినిమాలతోనూ బిజీగా గడుపుతోంది. వివాహం జరిగీ నెల రోజులు కూడా పూర్తి కాకముందే పని మొదలు పెట్టారని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు ఆమె సమాధానం ఇచ్చింది.
ఇటీవల తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో (Zaheer Iqbal) ఏడడుగులు నడిచింది బాలీవుడ్ తార సోనాక్షిసిన్హా (Sonakshi Sinha). వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు సినిమాలతోనూ బిజీగా గడుపుతోంది. వివాహం జరిగీ నెల రోజులు కూడా పూర్తి కాకముందే పని మొదలు పెట్టారని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు ఆమె సమాధానం ఇచ్చింది. "నా వ్యక్తిగత జీవితంతోపాటు, నేను ఎంతో ఆరాధించే నా వృత్తి కూడా ముఖ్యమే. అందుకే మళ్లీ చిత్రీకరణలు మొదలుపెట్టాను’’ అని దీటుగా జవాబిచ్చింది. తాజాగా 'కాకుడా’ (Kakuda movie) అనే హారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
"నాకు హారర్ సినిమాలంటే ఇష్టముండదు. అందుకే ఎప్పుడూ ఆ జానర్ టచ్ చేయలేదు. మొదటిసారి ‘కాకుడా’ స్క్రిప్ట్ చదువుతుంటే సరదాగా అనిపించింది. ఇందులో కామెడీ సన్నివేశాలు నచ్చాయి. దర్శకుడికి కూడా ఈ జానర్‌పై పట్టు ఉందని అనిపించింది. ప్రేక్షకులను ఎక్కడ భయపెట్టాలో.. ఎక్కడ నవ్వించాలో ఆయనకి బాగా తెలుసు. దర్శకులు మెచ్చే నటిగా ఉండాలనేది నా కోరిక. ‘ఈ అమ్మాయి జానర్ ఏదైనా చేయగలదు ఎలాంటి పాత్ర ఇచ్చిన వైవిఽధ్యంగా చేయగలదు’ అని నిర్మాతలు భావించేలా ఉండాలనుకుంటున్నాను. ఇప్పటివరకు ప్రతి జానర్ ప్రయత్నించా. కొన్ని సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. ఇంకొన్ని పరాజయాన్ని చవిచూశాయి. ఆ తప్పులు తెలుసుకొని, కొత్త విషయాలను నేర్చుకోగలిగాను. అదే ఈ రోజు నన్ను చిత్ర పరిశ్రమలో నటిగా మంచి స్థాయి నిలబెట్టింది.
'పరిశ్రమకు వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాను. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో నా ప్రయాణం. కథ, పాత్ర నన్ను ప్రోత్సహించేలా ఉండాలనుకుంటాను. కొంతకాలంగా అదే దిశలో అడుగులు వేస్తున్నాను. ప్రస్తుతం మహిళా ప్రాధాన్యం చిత్రాల్నే ఎంచుకుంటున్నా. నటిగా నాకు సంతృప్తినిస్తున్న విషయమిది. బయోపిక్‌లు, పీరియాడికల్ చిత్రాలపై నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ.. ‘అకీరా’ లాంటి యాక్షన్ చిత్రాల్లో నటించాలనుకుంటున్నా. రొటీన్ కథల్లో కనిపించకూడదని బలంగా నిర్ణయించుకున్నా. నాలుగు సీన్లు, రెండు పాటలతో ఆడిపాడే సినిమాలు ఎప్పటికీ ఇష్టపడను. సినిమాలో కీలకమైన పాత్ర అనిపిస్తేనే ఆ సినిమా అంగీకరిస్తాను'.
''ఓటీటీ మాధ్యమం కొత్త దర్శకులు, నటులు, రచయితలు, సాంకేతిక నిపుణులు ఇలా.. ఎంతోమందికి అవకాశం కల్పిస్తోంది. ఇదొక అద్భుతమైన వేదిక. దీంతో ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. ఓటీటీ, థియేటర్ అంటూ నాకేమీ తేడాలు లేవు. వేదిక ఏదైనా నటించడమే నా పని. థియేట్రికల్‌లో కూడా మంచి కథలు వస్తున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాల్ని ఎక్కడ విడుదల చేయాలో దర్శకులకు తెలుసు''