Samantha: అక్కడితో కథ ముగిసిపోయినట్లు కాదు!
ABN, Publish Date - Aug 01 , 2024 | 06:01 PM
సమంత (Samantha) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ ‘సిటడెల్ : హనీ బన్నీ’ (Citadel). వరుణ్ ధావన్ (varun Dhavan) కథానాయకుడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
సమంత (Samantha) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ ‘సిటడెల్ : హనీ బన్నీ’ (Citadel). వరుణ్ ధావన్ (varun Dhavan) కథానాయకుడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్2’ తర్వాత రాజ్ అండ్ డీకేతో (Raj and Dk) సమంత చేస్తోన్న రెండో ప్రాజెక్ట్ ఇది. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్ నడుస్తోందని సమాచారం. కేకే మీనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు కీలక పాత్రధారులు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా ముంబయిలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సమంత ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘వరుణ్‌ధావన్ నాకు మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. అది తెరపై చూడముచ్చటగా ఉంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంతో షూటింగ్ చక్కగా పూర్తి చేశాం. 12 నిమిషాల నిడివి గల యాక్షన్ సీన్‌ను సింగిల్ టేక్‌లో చిత్రీకరించారు. దాదాపు ఏడాది నుంచి ప్రేక్షకులకు చూపించేందుకు ఎదురుచూస్తున్నాం. యాక్షన్ ప్రియులకు కచ్చితంగా నచ్చుతుంది. వరుణ్ ధావన్‌తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మంచి మనసు ఉన్న వ్యక్తి’’ అని అన్నారు. జీవితంలో క్లిష్ట సమయాలను ఎలా ఎదుర్కొన్నారు? అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘కొన్నిసార్లు నేనూ చేతులెత్తేస్తాను. అయితే, అక్కడితో కథ ముగిసిపోయినట్లు కాదు. నేను తిరిగి పైకి లేస్తా’’ అని బదులిచ్చారు.
హీరో వరుణ్ ధావన్ మాట్లాడుతూ ‘‘సిటాడెల్: హనీ బన్నీ’ను మీకు చూపించేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం. ఎట్టకేలకు అది మీ ముందుకు వస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నాం. సమంతతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ కోసం తక్కువగా శ్రమించా. ఈ ప్రాజెక్ట్ ఓకే చేసిన సమయంలో ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అందరికి తెలుసు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ పక్కన పెట్టి వృత్తిపట్ల కనబరిచిన ఏకాగ్రత మా టీమ్ అందరిలో స్ఫూర్తినింపింది. ఈ ప్రాజెక్ట్ ఓకే చేసిన వెంటనే రాజ్ అండ్ డీకే నాకొక షరతు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకూ వేరే సినిమాలు, యాడ్స్‌లో వర్క్ చేయడానికి వీల్లేదన్నారు. బన్నీ రోల్ పోషించినందుకు ఆనందంగా ఉంది. సినిమాతో పోలిస్తే సిరీస్‌ల వల్ల ఒక రోల్‌తో ఎక్కువ కాలం ట్రావెల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది’’ అని వరుణ్ అన్నారు.