Poonam Pandey: నకిలీ మరణంపై రూ.100 కోట్ల పరువునష్టం
ABN, Publish Date - Feb 13 , 2024 | 10:11 AM
కాన్పూర్ కి చెందిన అన్సారీ అనే అతను కాన్పూర్ పోలీస్ స్టేషన్ లో పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బొంబాయిపై రూ. 100 కోట్లకు పరువునష్టం కేసు పెట్టాడు. ఆమె నకిలీ మరణం వలన ఎందరో ప్రజలు భావోద్వేగాలకు గురయ్యారని అతను ఆరోపించాడు
నటి, మోడల్ అయిన పూనమ్ పాండే ఇప్పుడు ఇంకో వివాదంలో చిక్కుకుంది. కొన్ని రోజుల క్రితం తాను చనిపోయినట్టుగా తన టీముతో ప్రకటించి, మళ్ళీ మరుసటి రోజు 'నేను బతికేవున్నాను చచ్చిపోలేదు' అని తన సామాజిక మాధ్యమంలో దర్శనం ఇచ్చిన పూనమ్ పాండే విషయం తెలిసిందే. కేవలం గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు అలా తాను మరణించినట్టుగా ఒక నకిలీ వార్త సృష్టించినట్టుగా చెప్పుకొచ్చింది. అయితే ఆమె చర్యని కొంతమంది అభినందించినా, చాలామంది విమర్శించారు కూడా.
చాలామంది నెటిజన్లు కూడా ఆమె చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఆమె మీద ఆమె భర్త సామ్ బాంబేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా నెటిజన్లు కోరిన సంగతి కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ వివాదం ఇంకో కొత్త మలుపు తిరిగింగి. ఆమె ఇలా నకిలీ వార్త సృష్టించి చనిపోయినట్టుగా ప్రకటించిన సంగతి విని కాన్పూర్ కి చెందిన అన్సారీ అనే వ్యక్తి ఆమె మీద రూ. 100 కోట్లకి పరువునష్టం దావా వేసాడు. ఫైజాన్ అన్సారీ అనే అతను కాన్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసును ఫైల్ చేసి ఆమె మీద ఆమె భర్త సామ్ బాంబేలపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు పెట్టారు. పూనమ్ ఆమె భర్త కలిసి కాన్సర్ అవగాహనకి ఇలా నకిలీ మరణాన్ని వాడుకోవడాన్ని, ఈ ప్రక్రియలో ఆమె క్యాన్సర్ తీవ్రతను చిన్నచూపు చూసి, ఎంతోమందిని ఎంతో భావోద్వేగానికి గురి చేశారని అన్సారీ ఆరోపించారు.
అన్సారీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, పూనమ్ ఆమె భర్త ఇద్దరూ బూటకపు మరణాన్ని ప్రకటించి కేవలం తమ ప్రచారం కోసం మాత్రమే వాడుకున్నారని అందులో ఆరోపించాడు. ఇలా చేయడంవలన చాలామంది ప్రజలకు ఎంతో బాధ కలిగించిందని, అదీ కాకుండా ఇది ఒక మోసపూరిత చర్య అని అతను తన ఫిర్యాదులో చెప్పారు. అందుకని వారిద్దరినీ అరెస్టు చేసి, కాన్పూర్ కోర్టులో హాజరుపరచాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎటువంటి చర్య తీసుకుంటాతో వేచి చూడాల్సిందే. అలాగే ఈ పరువునష్టం కేసుపై పూనమ్ ఎలా స్పందిస్తారో కూడా చూడాలి.