Om Puri: పుస్తకంలో వద్దంటే రాయమన్నారు.. ఏం జరిగిందంటే
ABN, Publish Date - Oct 01 , 2024 | 05:05 PM
ఓంపురి పనిమనిషితో అఫైర్ నడిపినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ వివాదంపై పుస్తక రచయిత, ఓంపురి మాజీ భార్య నందిత స్పందించారు
ఓంపురి.. (Om puri) ఆ పేరుకు పరిచయం అక్కర్లేదు. దేశంలోని చాలా భాషల్లో ఆయన నటించి వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు పొందారు. ఆయన బయోగ్రఫీ ‘అన్‌లైక్లీ హీరో: ఓంపురి’ (Unlikely Hero Om Puri) విడుదలైన సమయంలో ఓ వార్త వైరల్ కావడంతో తీవ్రమైన చర్చ జరిగింది. పనిమనిషితో అఫైర్ నడిపినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ వివాదంపై పుస్తక రచయిత, ఓంపురి మాజీ భార్య నందిత (Nanditha) తాజాగా స్పందించారు.
‘‘తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్ల గురించి ఆయన ఈ బయోగ్రఫీలో వెల్లడించారు. అలాగే వ్యక్తిగత విషయాలను అందులో చెప్పారు. పుస్తకం రాస్తున్నప్పుడు.. పనిమనిషితో అఫైర్ గురించి ఆయన చెప్పగానే.. దీని అవసరం ఏముంది.. వద్దు అని నేను చెప్పాను. కానీ, ఆయన అంగీకరించలేదు. ‘అందులో తప్పేముంది? అప్పటికి నేను పెళ్లి చేసుకోలేదు. రిలేషన్‌షిప్‌లోనూ లేను. చిన్న అఫైర్ అది. నిజాలు తెలిస్తే తప్పేంకాదు’ అని బదులిచ్చారు. ఆయన మాట ప్రకారం అందులో అన్నీ ఆయన చెప్పిన విధంగా రాశా. పుస్తకం విడుదలయ్యాక అందరూ ఆ విషయం గురించే ప్రస్తావించడం మొదలుపెట్టారు. అది ఆయన్ను బాగా కలచి వేసింది. ‘నా లైఫ్‌లో ఇది ముఖ్యమైన విషయం కాదు. కెరీర్, చిన్నతనంలో నేను ఎదుర్కొన్న సమస్యల గురించి అందరూ మాట్లాడుకుంటే బాగుండేది’ అని ఆయన అన్నారు’’ అని నందిత తెలిపారు. 2009లో ఈ పుస్తకం విడుదలైంది. ఇది విడుదలైన కొంతకాలానికి ఓంపురి, నందిత విడాకులు తీసుకున్నారు. ఈ వివాదం గురించి ఆయన ఓ సారి మాట్లాడుతూ.. ‘‘అందరిలాగే నేనూ నా భార్యకు అన్ని విషయాలు చెప్పా. తన పుస్తకం అమ్ముకోవడం కోసం ఆమె ఈ విషయాలను అందులో ప్రస్తావిస్తుందని అనుకోలేదు. ఆమె ఇలాంటి విషయాలు రాసినట్లు నా దృష్టికి రాలేదు’’ అని చెప్పారు. ‘రాత్రి’, ‘అంకురం’, ఘాజీ తదితర తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన 2017లో మరణించారు.