Emergency: కంగన రనౌత్.. ఎమర్జెన్సీకి సెన్సార్ కష్టాలు
ABN, Publish Date - Sep 04 , 2024 | 04:00 PM
బాలీవుడ్ అగ్ర నటి, ఎంపీ కంగనా రనౌత్ కాస్త విరామం తర్వాత స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ఎమర్జెన్సీ. అయితే ఈ సినిమా విడుదల విషయంలో సమస్యలు తప్పడం లేదు.
బాలీవుడ్ అగ్ర నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కాస్త విరామం తర్వాత స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ఎమర్జెన్సీ. తాజాగా ఈసినిమా ట్రైలర్ విడుదల చేశారు. 1975 నుంచి 1977ల మధ్యలో ఇందిరాగాందీ ప్రభుత్వం అధికారంలో జరిగిన ఎమర్జెన్సీ (Emergency) పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. కంగనా ఈ సినిమాలో ఇందిరాగాంధీగా నటించగా అనుపమ్ ఖేర్ (Anupam Kher) జయప్రకాశ్ నారాయణ్‌గా, శ్రేయాస్ తల్పడే (Shreyas Talpade) వాజపేయి పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాను సెప్టెంబర్6న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
అయితే ఈ సినిమా విడుదల విషయంలో సమస్యలు తప్పడం లేదు. ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలను మసక బార్చారని, సిక్కుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ‘ఎమర్జన్సీ’ చిత్రం ఉందనీ, సిక్కులకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలనీ, విడుదల చేయడానికి వీల్లేదని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) అకల్ తక్త్ డిమాండ్ చేశాయి. ఎస్‌జీపిఎస్ ఛీఫ్ హర్‌జిందర్ సింగ్ ధామి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి కంగనను తీవ్రంగా విమర్శించడమే కాకుండా ఆమెపై కేసు పెట్టాలని కూడా కోరారు.
ఈ క్రమంలో పలు సిక్కు సంస్థలు కోర్టులో పిటిషన్ వేయడంతో.. ఈ సినిమాపై తలెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సర్టిఫికెట్‌ను జారీ చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఎఫ్‌సీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో మేకర్స్ ముంబై కోర్టును ఆశ్రయించగా ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్‌ను జారీ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ని ఆదేశించలేమని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ మేరకు జస్టిస్ బీపీ కోలాబవాలా, జస్టిస్ ఫిర్దోశ్ పూనివాలా డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ‘మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఎఫ్‌సీకి మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఆ ఉత్తర్వులను నేరుగా ఉల్లంఘించినట్టు సీబీఎఫ్‌సీకి చెప్పినట్టు అవుతుందని డివిజన్ బెంచ్ వ్యాఖ్యలు. సినిమాపై తలెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 18 నాటికి సర్టిఫికెట్ జారీ చేయాలని బాంబే హైకోర్టు సెన్సార్‌బోర్డును కోరింది.