Kangana Vs Jaya Bachchan: ఇంత అహంకార వైఖరి కరెక్ట్‌ కాదు.. జయబచ్చన్‌పై ఫైర్‌

ABN, Publish Date - Sep 02 , 2024 | 03:21 PM

పార్లమెంట్‌లో ఇటీవల జయా బచ్చన్‌ (Jaya Bachchan)పేరుపై నెలకొన్న వివాదాన్ని ఉద్దేశించి ఎంపీ కంగనా రనౌత్‌ 9kangana Ranaut)  కీలక వ్యాఖ్యలు చేశారు.


పార్లమెంట్‌లో ఇటీవల జయా బచ్చన్‌ (Jaya Bachchan)పేరుపై నెలకొన్న వివాదాన్ని ఉద్దేశించి ఎంపీ కంగనా రనౌత్‌ 9kangana Ranaut)  కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో రాజ్యసభ్య డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌.. జయా బచ్చన్‌ను.. ‘జయా అమితాబ్‌ బచ్చన్‌’ అని సంబోధించారు. దీనిపై జయా బచ్చన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జయా బచ్చన్‌ అంటే సరిపోతుంది’ అంటూ పేర్కొన్నారు. ‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’ అని డిప్యూటీ ఛైర్మన్‌ చెప్పగా.. ‘మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా ఈ అంశంపై మాట్లాడారు. ‘‘ఇది అవమానకర విషయం. స్త్రీ, పురుషుల మధ్య అందమైన వ్యత్యాసాన్ని ప్రకృతి సృష్టించింది. దానిని కొందరు వివక్షగా చూస్తున్నారు. స్త్రీ, పురుషులు కలిసినప్పుడే జీవితం అందంగా ఉంటుంది. పార్లమెంట్‌ వేదికగా పేరు విషయంలో నెలకొన్న వివాదం చాలా చిన్న విషయం’’ అని కంగనా అన్నారు.

అనంతరం జయాబచ్చన్‌ తీరును తప్పుబడుతూ.. ‘‘ఈ విధమైన అహంకార వైఖరి ఉంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బంధంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. మనుషులెప్పుడూ ఒకరికొకరు కలిసి ఉండాలి. ఇలాంటి కఠిన వైఖరితో వారిని విడదీయకూడదు. మన పేరు వెనక మరో వ్యక్తి పేరు వచ్చి చేరినంతనే కొంతమంది కోపానికి గురవుతున్నారు. తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. అంతమాత్రానికే తమ గుర్తింపుపోతుందని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు నాకు బాధగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.



కోర్టులో పోరాడటానికైనా సిద్ధమే..

ప్రస్తుతం కంగనా తన తదుపరి చిత్రం ‘ఎమర్జెన్సీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని దీనిని రూపొందించారు. కంగన స్వీయ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. సెప్టెంబర్‌ 6న ఇది విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇంకా రాకపోవడంతో రిలీజ్‌ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపైౖ కంగనా స్పందించారు.  ‘నా సినిమాపై కూడా ఎమర్జెన్సీ విధించారు. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. నేను నిరాశకు గురయ్యాను’ అని అన్నారు. ఓటీటీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని చట్టం ఏంటంటే.. ఓటీటీలో అయితే ఎటువంటి సెన్సార్‌ ఉండదు. అనూహ్యమైన హింసను, అశ్లీలతను ప్రదర్శించవచ్చు. రాజకీయంగా పలుకుబడి ఉంటే నిజజీవిత సంఘటనలను కూడా వక్రీకరించి సినిమాలు తీయొచ్చు. ఓటీటీల్లో అంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్వేఛ్చ కొంచెం కూడా మాలాంటి వాళ్లకు ఉండదు. అందుకే దేశ సమగ్రత, ఐక్యత చుట్టూ తిరిగే చిత్రాలను తీయడానికి మాకు అనుమతి ఉండదు. కొన్ని చిత్రాలు తీయడానికి మనలో కొంతమందికి మాత్రమే సెన్సార్‌షిప్‌ ఉంది. ఇది అన్యాయం’ అని పేర్కొన్నారు. సెన్సార్‌బోర్డ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే తాను కోర్టులో పోరాడటానికైనా సిద్ధమే అని కంగనా తెలిపారు. 

Updated Date - Sep 02 , 2024 | 03:40 PM