Ratan Tata: రతన్ టాటా నిర్మించిన సినిమా గురించి తెలుసా!
ABN, Publish Date - Oct 10 , 2024 | 12:24 PM
రతన్ టాటా ఎంటర్ టైన్‌మెంట్ రంగంలోనూ టాటా అడుగుపెట్టిన సంగతి చాలామందికి తెలియదు. 2004లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఏత్బార్ అనే హిందీ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించారు.
టాటా.. రతన్ టాటా (Ratan Tata) ఈ పేరంటే తెలియని భారతీయుడంటూ ఉండరు. అంతగా మన ప్రజలతో పెనవోసుకుబోయిన బంధం ఆయనది. అలాంటి వ్యక్తి ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడవడంతో దేశవ్యాప్తంగా ప్రజలు కన్నింటి పర్యంతం అవుతున్నారు. ఆయన దేశానికి, ప్రజలకు అందించిన సేవలను కొనియాడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలామంది తమ సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపం తెలియజేస్తూ నివాళులర్పిస్తున్నారు.
అయితే ఇప్పటికే ఇందుగలడందుగలడు అను రీతిలో అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టి విజయబావుటాఎగురవేసి పారిశ్రామిక రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. టాటా స్టీల్, సాల్ట్, టాటా కార్స్, టెలికాం, ఐటీ ఇలాంటి ప్రముఖ కంపెనీలు మాత్రమే ఉన్నాయని తెలుసు కానీ ఎంటర్ టైన్‌మెంట్ రంగంలోనూ టాటా అడుగుపెట్టిన సంగతి చాలామందికి తెలియదు. 2004లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), జాన్ అబ్రహం (John Abraham), బిపాసబసు (Bipasha Basu) ప్రధాన పాత్రల్లో ప్రేమ, వ్యామోహం, కుటుంబ సంబంధాలు కథాంశంగా రూపొందిన ఏత్బార్ (Aetbaar) అనే ఓ హిందీ సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు.
అంతకుముందు హాలీవుడ్‌లో వచ్చిన ఫియర్ అనే ఇంగ్లీష్ చిత్రాన్ని రిమేక్ చేస్తూ విక్రమ్ భట్ (Vikram Bhatt) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సుమారు రూ.8 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.9.50 కోట్లు మాత్రమే రాబట్ట కలిగింది. అయితే, రతన్ టాటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఒకే ఒక సినిమాగా చరిత్రలో నిలిచింది. ఆ తర్వాత 2006 నుంచి మన దేశంలో టాటా స్కై పేరుతో డీటీహెచ్ సర్వీస్‌ను ప్రారంభించగా ప్రస్తుతం టాటా ప్లై (Tata Play)గా పిలవడుతూ టీవీ చానళ్లను, ఓటీటీ యాప్స్‌ను ప్రజలకు అందిస్తూ దేశంలో ఆగ్రభాగాన ఉంది.