Dipika Chikhlia: ఆ సినిమా చేయకపోవడం వల్లే.. ఈ రోజు ఇంత గుర్తింపు
ABN, Publish Date - May 27 , 2024 | 07:51 PM
బుల్లితెర సీతగా గుర్తింపు పొందారు దీపికా చిఖ్లియా(Dipika Chikhlia). రామానంద్ సాగర్ (Ramanand Sagar) రూపొందించిన ‘రామాయణ్’ సీరియల్‌లో సీతగా నటించి, ప్రేక్షకులను విశేషంగా అలరించారామె!
బుల్లితెర సీతగా గుర్తింపు పొందారు దీపికా చిఖ్లియా(Dipika Chikhlia). రామానంద్ సాగర్ (Ramanand Sagar) రూపొందించిన ‘రామాయణ్’ సీరియల్‌లో సీతగా నటించి, ప్రేక్షకులను విశేషంగా అలరించారామె! తనకెంతో గుర్తింపు తీసుకొచ్చిన ఆ పాత్ర అవకాశం ఎలా దక్కిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘రామ్ తేరీ గంగా మైలీ’ (Ram teri ganga maili)సినిమాలో నటించకపోవడం వల్లే సీతగా నటించే అవకాశం తనకు దక్కిందన్న ఆమె చెప్పారు.
‘‘కెరీర్ బిగినింగ్‌లో హీరోయిన్‌గా కొన్ని చిన్న సినిమాల్లో నటించా. అది సంతృప్తి ఇవ్వకపోవడంతో ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నా. ఆ సమయంలో ఓ ఆడిషన్ గురించి తెలిసింది. నటుడు, దర్శకుడు రాజ్‌కపూర్ కుమార్తె రీవ ఫ్రెండ్ వాళ్ల నాన్న, మా నాన్న స్నేహితులు.. ఆయన ఓ రోజు నన్ను కలిసి.. రాజ్‌కపూర్ ‘రామ్ తేరీ గంగా మైలీ’ సినిమా కోసం వర్థమాన నటులను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. ఆసక్తితో నేను రాజ్‌కపూర్‌ని కలిశాను. ఆయన నన్ను అడిగిన తొలి ప్రశ్న ‘నీ వయసెంత?’. 17 ఏళ్లు అని సమాధానమిచ్చా. ‘చాలా చిన్న వయసు..’ అనుకుంటూ నన్ను తిరస్కరించారు.
కొంతకాలం తర్వాత సినిమా విడుదలైంది. మా అమ్మతో కలిసి చిత్రాన్ని చూసేందుకు థియేటర్‌కు వెళ్లా. కొన్ని సీన్స్ చూసి షాకయ్యా. ఆ మూవీలో నటించే ఛాన్స్ మిస్ కావడంతో మంచే జరిగింది అనుకున్నా. ఒకవేళ ఆ చిత్రంలో నటించి ఉంటే ‘రామాయణ్’లో సీత పాత్ర దక్కేది కాదేమో’’ అంటూ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘లవ కుశ్’, ‘ది స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్’ తదితర ధారావాహికల్లో నటిస్తూనే హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ్, గుజరాతీ, తెలుగు చిత్రాల్లోనూ నటించారు దీపికా చిఖ్లియా. ‘యమపాశం’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.