Adipurush: ఇతిహాసాల జోలికిపోకుండా ఉంటే మంచిది!
ABN, Publish Date - Jun 09 , 2024 | 10:14 AM
ప్రభాస్ (Prabhas) హీరోగా ఓంరౌత్ (Om raut) దర్శకత్వంలో గతేడాది విడుదలైన ‘ఆదిపురుష్(Adipurush) ’ చిత్రంపై విమర్శలు ఇప్పటికీ తగ్గలేదు. విడుదలై ఏడాది గడుస్తున్నా ఏదో కారణంతో ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
ప్రభాస్ (Prabhas) హీరోగా ఓంరౌత్ (Om raut) దర్శకత్వంలో గతేడాది విడుదలైన ‘ఆదిపురుష్(Adipurush) ’ చిత్రంపై విమర్శలు ఇప్పటికీ తగ్గలేదు. విడుదలై ఏడాది గడుస్తున్నా ఏదో కారణంతో ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలోని పాత్రల వేషధారణలపై అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. వివాదాలకు దారి తీశాయి. తాజాగా రమానంద్ సాగర్ 'రామాయణ్’ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా (Deepika Chikhalia) మరోసారి విమర్శించారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రంలోని పాత్రలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆదిపురుష్’ చూసిన నేటితరం పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందేమోనని భావిస్తారు. అది భవిష్యత్తుకు ప్రమాదకరం. ఆ విషయం తలచుకుంటే బాధేస్తుంది. ఈ చిత్రంలో చూపించినట్లు రావణుడు ఉండడని వాళ్లకు ఎవరూ వివరించడం లేదు. దీంతో రామాయణంలో రాముడు, సీత కూడా ఇలానే ఉంటారని వారు నిర్ణయించుకుంటున్నారు. రావణుడు గొప్ప శివభక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలున్నాయి. ఆయన జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు సీతను అపహరించడమే. ఆ ఒక్కటి చేయకపోతే ఆయన గొప్ప పండితుడిలా ఉండేవారు. అంత గొప్ప వ్యక్తిని ‘ఆదిపురుష్’లో రోడ్‌సైడ్ రౌడీలా చూపించడం నన్ను బాధ కలిగించింది. నేను ఈ సినిమాను ఇప్పటివరకు పూర్తిగా చూడలేదు. టీవీలో కొంతభాగం చూసేసరికి తట్టుకోలేక పోయాను. సీతాదేవిని గులాబీ రంగు చీరలో చూపడం, రావణాసురుడిని విభిన్నమైన ఆహార్యంలో చూపించడం ఏమాత్రం నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ ఇతిహాసాల జోలికి పోకుండా యువతలో స్ఫూర్తి నింపే స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రలను సినిమాలుగా తీస్తే బాగుంటుంది’ అని దీపికా అన్నారు.
ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ సీతగా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. ఓంరౌత్ దర్శకత్వంలో టీ సిరీస్ సంస్థ నిర్మించింది. గతేడాది జూన్ లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది.