Triptii Dimri: బ్యాక్ బెంచ్ అమ్మాయిని.. అందుకే ఈ నిర్ణయం.. అమ్మ నాన్న షాక్!
ABN, Publish Date - Mar 10 , 2024 | 10:19 AM
‘యానిమల్’లో ప్రధాన హీరోయిన్ కాదు... అయినప్పటికీ ‘జోయా’గా కొద్దిసేపే కనిపించిన త్రిప్తీ దిమ్రీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు బాలీవుడ్‌తో పాటు... ఇటు తెలుగులో కూడా బడా హీరోలతో జోడీ కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
‘యానిమల్’లో ప్రధాన హీరోయిన్ కాదు... అయినప్పటికీ ‘జోయా’గా కొద్దిసేపే కనిపించిన త్రిప్తీ దిమ్రీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు బాలీవుడ్‌తో పాటు... ఇటు తెలుగులో కూడా బడా హీరోలతో జోడీ కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. తన గురించి ఈ ఉత్తరాఖండ్ బ్యూటీ ఏం చెబుతోందంటే...
అనుకోకుండా సినిమాల్లోకి...
నేను పుట్టింది ఉత్తరాఖండ్‌లోనైనా పెరిగిందంతా ఢిల్లీలోనే. సైకాలజీలో డిగ్రీ పట్టా పొందా. చదువులో నేనేప్పుడూ వెనకబెంచ్‌కే పరిమితం. అందుకే జీవితంలో స్థిరపడాలంటే చదువుతో సంబంధం లేకుండా వేరే ఏదైనా చేయాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నా. అయితే సినిమాల్లోకి వస్తానని మాత్రం అస్సలు ఊహించలేదు. ఓ రోజు నా సోదరుడి స్నేహితుడు (ఫొటోగ్రాఫర్) సరదాగా ‘టెస్ట్ ఫొటో షూట్ చేద్దాం’ అన్నాడు. సరేనని కొన్ని పోజులిచ్చా. అతనే నా ఫొటోలను ఎవరికో పంపించాడు. ఇక అక్కడి నుంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. క్రమంగా నటనతో ప్రేమలో పడ్డా.
అలాంటివాడే కావాలి...
ఒకప్పుడు అందరమ్మాయిల్లాగే కాబోయే వాడు అందగాడై ఉండాలనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. నా జీవితంలోకి వచ్చేవాడు నన్ను మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్లను కూడా అర్థం చేసుకునే మంచి మనసున్న వ్యక్తి అయి ఉండాలి. ఎలాంటి వ్యత్యాసం చూపకుండా నన్ను కూడా తనతో సమానంగా భావించేవాడై ఉండాలి. అంతకుమించి ఇంకేమి అక్కర్లేదు.
ఎవ్వరితో కలిసేదాన్ని కాదు
ఒకప్పుడు నేను ఇంట్రావర్ట్‌ని. ఎవరితోనూ పెద్దగా కలిసేదాన్ని కాదు. ఇంటికెవరైనా బంధువులొచ్చినా సరే వాళ్లతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. క్లాస్‌రూంలో సందేహాలు కూడా అడిగేదాన్ని కాదు. కాలేజీకి వచ్చేసరికి నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. మొదటిసారి ఆడిషన్‌కి వెళ్లినప్పుడు కెమెరా ముందు కాస్త తడబడినా ఆశ్చర్యంగా సెలెక్టయ్యా. అలా నా మొదటి సినిమా ‘పోస్టర్ బాయ్స్’ షురూ అయ్యింది. ఆ తర్వాత వరుసగా ‘లైలా మజ్ను’, ‘బుల్‌బుల్’, ‘ఖాలా’లో నటించా. మొత్తానికి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నా భయాలతో పోరాడాలని నిర్ణయించుకున్నాను కాబట్టే ఈ రోజు ఇలా ఉన్నాను.
కలవరపడ్డా... కానీ...
‘యానిమల్’ విడుదలైన తర్వాత ప్రశంసలతో పాటు వెల్లువెత్తిన విమర్శలు మొదట బాగా కలవరపెట్టాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ నాకు అలాంటి అనుభవం ఎదురవ్వలేదు. శృంగార సన్నివేశాలు తీస్తున్నప్పుడు నేను, రణబీర్, దర్శకుడు, కెమెరామెన్ మాత్రమే సెట్‌లో ఉన్నాం. నాకు ఇబ్బంది కలగకుండా వారు చూసుకున్నారు. నాకు అసౌకర్యంగా లేనప్పుడు, నేను చేస్తున్నది తప్పు కాదని నమ్మినప్పుడు... ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం.
బాధపడ్డారు...
ఇంటిమేట్ సీన్స్‌లో నేను యాక్ట్ చేయడం చూసి అమ్మానాన్న షాకయ్యారు. ‘సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఎప్పుడూ చూడలేదు. నిన్ను అలాంటి సన్నివేశాల్లో చూసేసరికి మాకు బాధగా అనిపించింది. ఇలాంటివి చేయకుండా ఉండాల్సింద’ని అన్నారు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి వాళ్లకు కాస్త సమయం పట్టింది. అయితే నేనెలాంటి తప్పు చేయలేదని, కేవలం నా వృత్తిలో భాగమేనని వాళ్లకు అర్థమయ్యేలా వివరించి కూల్ చేశాను.
ఫటాఫట్
మొదటి సెలబ్రిటీ క్రష్- షారుక్ ఖాన్
ఫేవరెట్ క్రికెటర్- విరాట్ కోహ్లీ
అభిమాన దక్షిణాది హీరో- ఎన్టీఆర్
ఎవరికీ తెలియని విషయం- పాటలు బాగా పాడుతా. చీకటి అంటే భయం.
ఇష్టమైన ఆహారం- నూడుల్స్
ఎక్కువ ఉపయోగించే ఎమోజీ- మంకీ
ఖాళీ దొరికితే - ప్రయాణాలు చేస్తుంటా