Deepika Padukone: ఒకరిపై మరొకరికి ఓనర్‌షిప్‌ ఉంది 

ABN, Publish Date - Jul 07 , 2024 | 03:12 PM

బ్లాక్‌బ్లస్టర్‌ బ్యూటీ దీపికా పదుకొణే మరోసారి తన సత్తా చాటుకుంది. ఒకవైపు అగ్ర హీరోలతో కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే, మరోవైపు కథాబలం ఉన్న చిన్న సినిమాల్లో సైతం రకరకాల పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సృష్టించుకుంది

బ్లాక్‌బ్లస్టర్‌ బ్యూటీ దీపికా పదుకొణే (Deepika padukone) మరోసారి తన సత్తా చాటుకుంది. ఒకవైపు అగ్ర హీరోలతో కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే, మరోవైపు కథాబలం ఉన్న చిన్న సినిమాల్లో సైతం రకరకాల పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సృష్టించుకుంది. తాజాగా ప్రభాస్‌ ‘కల్కి’లో సుమతి పాత్రలో మెరిసింది. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్న దీపిక ఇటీవల పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలివి...


పని మాత్రమే తెలుసు... కానీ... (Ranveer singh)
‘‘మోడల్‌గా, నటిగా కెరీర్‌ ప్రారంభంలో నేను చాలా కష్టాలే పడ్డాను. ఎందుకంటే ఇక్కడ నాకెవ్వరూ తెలియదు. పని... పని... పని మాత్రమే నాకు తెలుసు. ఒకరకంగా నేను వర్క్‌హాలిక్‌నే. అది కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకే. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం మధ్య బ్యాలెన్స్‌ ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అందుకే ఎప్పుడూ ఆనందంగా ఉంటా’’.

అదే మా బలం (Bollywood actress)
‘‘నాకు బాగా ఇష్టమైనవి రెండు ఉన్నాయి. ఒకటి ఫుడ్‌. రెండోది డ్యాన్స్‌. నా అదృష్టం కొద్దీ నా భర్త రణ్‌వీర్‌సింగ్‌కు కూడా ఈ రెండంటే ఇష్టం. అందుకే మేమిద్దరం బాగా తింటాం. వీకెండ్స్‌లో నచ్చిన మ్యూజిక్‌ పెట్టుకుని, లివింగ్‌ రూమ్‌లో తెల్లవారుఝామున 4 గంటల దాకా డ్యాన్స్‌ చేస్తూనే ఉంటాం. నా భర్తతో కలిసి గడపడమంటే నాకు భలే సరదాగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా రణ్‌వీర్‌ కుటుంబంతో నేను, నా కుటుంబంతో అతడు గడిపేందుకు సమయం వెచ్చిస్తాం. అదే మా అనుబంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది’’.

 
పిల్లలంటే ఇష్టం
‘‘నాకు, రణ్‌వీర్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్లయినప్పటి నుంచే పిల్లల గురించి అనేక కలలు కన్నాం. త్వరలోనే మా కల నిజం కాబోతోంది. బోలెడు మంది పిల్లలకు తల్లిని కావాలనుకుంటున్నా. అయితే మాలాగే పిల్లల్ని కూడా కుటుంబ విలువలు తెలిసేలా పెంచాలనుకుంటున్నాం’’.

సామాన్యురాలినే...
‘‘కీర్తి ప్రతిష్టలను నేనెప్పడూ తలకెక్కించుకోను. వాటి గురించి పెద్దగా చర్చించని వ్యక్తులే నా చుట్టూ ఉంటారు. ఒక కూతురిగా, భార్యగా, సోదరిగా, కోడలిగా నన్ను ఇంట్లోవాళ్లంతా ఒక సగటు మహిళగానే చూస్తారు. నేను ఈ సర్కిల్‌ నుంచి బయటకు వచ్చినప్పుడే నన్ను సెలబ్రిటీగా చూస్తారు. ఇక కీర్తిప్రతిష్టల గురించి నాకున్న అభిప్రాయం ఏమిటంటే... సెలబ్రిటీలు సమాజంలో మార్పును తీసుకురాగలుగుతారు. ప్రజల దగ్గరికి వెళ్లగలరు. వారిని ప్రభావితం చేయగలరు. నా వరకు నాకు అదే ఉత్తేజకరమైన అంశం. కీర్తి ప్రతిష్టలు ఎలా వచ్చాయనే దాని కన్నా వాటిని ఎలా ఉపయోగిస్తున్నామనేదే ముఖ్యం’’.


నచ్చకుండా ఏదీ చేయను...
‘‘సినిమాలో ఒక పాత్ర అయినా, నిజ జీవితంలో ఏ పనైనా నాకు నచ్చకుండా అస్సలు చేయలేను. ఏదైనా సంపూర్ణంగా నచ్చి,  సంతోషంగా చేస్తేనే ఫలితం బాగుంటుంది’’.


అదృష్టానికి మించి...
‘‘బాలీవుడ్‌లో నా తొలి సినిమా షారుక్‌ఖాన్‌తో చేసిన ‘ఓం శాంతి ఓం’ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత కూడా మా హిట్‌ కాంబినేషన్‌ కొనసాగింది. ‘హ్యాపీ న్యూ ఇయర్‌’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ నుంచి ‘పఠాన్‌’, ‘జవాన్‌’ దాకా మాది సక్సెస్‌ఫుల్‌ జోడీ. దాంతో నన్ను అంతా ‘షారుక్‌ లక్‌ ఫ్యాక్టర్‌ నువ్వే’ అంటుంటారు. అయితే ఒక రకంగా మేము ఒకరికొకరం అదృష్టవంతులం. నిజాయితీగా చెప్పాలంటే అదృష్టానికి మించిన వాళ్లం. మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి అపారమైన గౌరవ, మర్యాదలతో పాటు ఒకరిపై మరొకరికి ఓనర్‌షిప్‌ ఉంది’’.

Updated Date - Jul 07 , 2024 | 06:14 PM