మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhumi Pednekar: ప్రభావితం చేయాల్సింది నంబర్స్‌తో కాదు!

ABN, Publish Date - Mar 04 , 2024 | 07:25 PM

మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు, కథా బలమున్న చిత్రాల వైపే దృష్టి సారించే భూమిపెడ్నేకర్‌ సందేశాత్మక చిత్రాల్లో నటించాలనుందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు, కథా బలమున్న చిత్రాల వైపే దృష్టి సారించే భూమిపెడ్నేకర్‌ (Bhumi pednekar) సందేశాత్మక చిత్రాల్లో నటించాలనుందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వాస్తవ సంఘటనల ఆధారంగా పులకిత్‌ తెరకెక్కించిన ‘భక్షక్‌’ (Bhakshak) సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు భూమి. ఈ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భూమి మాట్లాడారు. ఓటీటీల గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు. ‘‘కాలం చాలా మారిపోయింది. థియేట్రికల్‌ రిలీజ్‌ అంటే చిత్రబృందంపై కొంత ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు రాబట్టలేకపోయినా ప్రశంసలు అందుకుంటాయి. సినీ పరిశ్రమలో ఉన్నవారు ఈ నంబర్‌ గేమ్‌ నుంచి బయటపడాలి. నా దృష్టిలో థియేట్రికల్‌, ఓటీటీ రెండూ ముఖ్యమే. సినిమాలు ఎక్కడ విడుదలైనా కథ నచ్చితే ప్రేక్షకులు ఆదరిస్తారు. నటనతో ప్రభావం చూపించాలి కానీ నంబర్స్‌తో కాదు’’ అని భూమి పెడ్నేకర్‌ అన్నారు.



భక్షక్‌ చిత్రం గురించి మాట్లాడుతూ  ‘‘సామాజిక సందేశం ఉన్న సినిమాలు చేయాలనేది నా కోరిక. ఆ తరహా కథలను ఎంజాయ్‌ చేస్తూ చేస్తాను. ఏదో ఒక పాత్రలో నటించే కంటే ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించాలనుంది. చేసే పాత్ర కథను నడిపించేలా ఉండాలి. భక్షక్‌లో జర్నలిస్ట్‌గా నా పాత్రకు చక్కని ప్రాధాన్యం ఉంది. ఈ సినిమా కారణంగా మానసిక స్థితి మెరుగుపడింది. ఇదొక కొత్త అనుభవం. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. నాకెంతో చాలా ఆనందంగా ఉంది. సోషల్‌ మీడియాలో సినిమా చాలా బాగుందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇది నిజంగా థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ప్రేక్షకుల ఆదరణ, అభిమానం పొందుతున్న భక్షక్‌ విజయాన్ని ఆనందిస్తున్నా. నటీనటులకు ప్రశంసలు, ఆదరణ ఎంతో అవసరం. నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 07:25 PM